- ప్రశ్నిస్తే ఎక్కడ తొక్కాల్నో అక్కడ తొక్కుతానంటంది
- మూడు కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ఆందోళన
- ప్రిన్సిపాల్ దివ్య రాణి సస్పెన్షన్
ఆసిఫాబాద్, వెలుగు : అసిఫాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బూరుగుడా వద్ద ఉన్న ట్రైబల్వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ దివ్య రాణి తీరుపై స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ శుక్రవారం ఉదయం సుమారు 200 మంది స్టూడెంట్స్ కాలేజీ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని కలెక్టేరేట్కు ర్యాలీగా వెళ్లారు. అక్కడ కొన్ని గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ పనిష్మెంట్ పేరుతో ప్రిన్సిపాల్ అసభ్యంగా మాట్లాడుతోందని, మీద ఉమ్ముతోందని, ప్రశ్నిస్తే టీసీపై బ్యాడ్ బిహేవియర్ అని రాసిస్తానంటూ బెదిరిస్తోందన్నారు.
తినడానికి సరైన స్థలం కూడా లేక ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటున్నామని.. ప్రిన్సిపాల్‌ను అడిగితే ‘మీ స్థాయి అంతే అక్కడే కూర్చొని తినాలి’ అంటూ హీనంగా మాట్లాడుతోందని వాపోయారు. రెసిడెన్షియల్ స్కూల్‌ను చూడాల్సిన ఆర్సీఓ ఎలా ఉంటాడో తమకి తెలియదని, రెసిడెన్షియల్‌కు వచ్చిన సమయంలో కూడా తమ సమస్యలు తెలుసుకోడని, కేవలం ప్రిన్సిపాల్ ఛాంబర్లో కూర్చొని మాట్లాడి వెళ్లిపోతారన్నారు. కాలేజీలో జరిగే కార్యక్రమాలకు కూడా తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్ మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని, తనను ఎవరూ ఏమీ చేయలేరని అంటోందని, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతానని బెదిరిస్తోందన్నారు.
విషయం తెలుసుకున్న డీఆర్వో కదం సురేశ్, డీటీడీవో రమాదేవి, డీఎస్పీ వెంకటరమణ, పీటీజీ ప్రిన్సిపాల్స్ సురేశ్, ఎస్సైలు మహేందర్, ప్రవీణ్, తేజస్విని వారి వద్దకు వచ్చి మాట్లాడారు. ప్రిన్సిపాల్‌ను తొలగించేంత వరకు ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. దీంతో గిరిజన శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమనాథ్ శర్మతో పీటీజీ ప్రిన్సిపాల్ సురేశ్ ఫోన్ లో మాట్లాడించారు. ఆయన హామీ ఇచ్చినా ధర్నా విరమించలేదు.చివరకు ఐదుగురు స్టూడెంట్లను కలెక్టరేట్లోపలకు తీసుకువెళ్లగా కలెక్టర్ బోర్కడ హేమంత్ కు వినతి పత్రం ఇచ్చారు.
బయటకు వచ్చిన కొద్దిసేపటికే గిరిజన శాఖ అసిస్టెంట్ కమిషనర్ సోమనాథ్ శర్మ ప్రిన్సిపాల్ దివ్యరాణిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించడంతో ఆందోళన విరమించారు. ప్రిన్సిపాల్ దివ్యరాణి కాలేజీకి వస్తే మళ్లీ రోడ్డెక్కుతామని హెచ్చరించారు.