టాయిలెట్ కోసం వెళ్లి శవమైండు.. క్వారీ గుంత నీటిలో తేలిన స్టూడెంట్ డెడ్ బాడీ

టాయిలెట్ కోసం వెళ్లి శవమైండు.. క్వారీ గుంత నీటిలో తేలిన స్టూడెంట్ డెడ్ బాడీ

తొర్రూరు, వెలుగు: క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. తొర్రూర్ మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కడెం రాజాలు, సునీత దంపతుల కొడుకు హరీశ్(17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం టాయిలెట్ కోసం గ్రామ శివారుకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు స్థానికంగా వెతకగా క్వారీ గుంత వద్ద హరీశ్​చెప్పులు కనిపించాయి.

గుంతలో పడి ఉంటాడని అనుమాంచి పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చి వెతకగా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం నీటిలో హరీశ్​ డెడ్ బాడీ తేలడంతో స్థానికులు చూసి పోలీసులకు తెలిపారు. డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం కోసం వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.