- 15 కిలోమీటర్లు నడిచి వచ్చి సూర్యాపేట కలెక్టరేట్ వద్ద స్టూడెంట్ల నిరసన
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయాలని స్టూడెంట్లు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ రూమ్‌లో మద్యం సీసాలు దొరికిన టైంలో సస్పెండ్ చేస్తామని చెప్పిన ఆఫీసర్లు మాట తప్పి నామమాత్రంగా ట్రాన్స్‌ఫర్ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం బాలెంలలోని కాలేజీ నుంచి 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు నిరాకరించిన స్టూడెంట్లు ఆఫీసర్లే బయటకు వచ్చి తమతో మాట్లాడాలని పట్టుపట్టారు. ప్రిన్సిపాల్ కాలేజీ ఆవరణలోనే మద్యం సేవిస్తూ స్టూడెంట్లను వేధించడమే కాకుండా బూతులు తిట్టేదని, మెనూ ప్రకారం భోజనం సైతం పెట్టేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన వసతులు లేవని అడిగితే టీసీలు ఇచ్చి పంపేస్తానని బెదిరించేదని ఆరోపించారు.
ఆర్‌సీవో అరుణ కుమారి గురుకుల కాలేజీలు, స్కూల్స్ ప్రిన్సిపాల్స్‌తో కుమ్మక్కై స్టూడెంట్ల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేయడంతో పాటు ఆర్సీవో అరుణకుమారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. కలెక్టర్ సహా ఉన్నతాధికారులెవరూ బయటకు రాకపోవడంతో రాత్రి వరకు స్టూడెంట్ల ఆందోళన కొనసాగింది.