హోలీ సెలవులకు వచ్చి అనంత లోకాలకు

హోలీ సెలవులకు వచ్చి అనంత లోకాలకు
  • అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన బైక్

  • అక్కడికక్కడే చనిపోయిన ఇద్దరు బీటెక్ స్టూడెంట్లు

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: హోలీ పండుగ సెలవులకు వచ్చిన ఇద్దరు బీటెక్ స్టూడెంట్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఎస్సై చల్లరాజు వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉమ్మడి ఉమేశ్(22), లక్ష్మీదేవి పేట గ్రామానికి చెందిన ఎంబడి శృశాంత్(22) హైదరాబాద్‌‌లోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. హోలీ పండుగ సెలవులకు ఇంటికి వచ్చిన వీళ్లు సోమవారం మధ్యాహ్నం పాలంపేటకు వెళ్లారు. తిరిగి బైక్‌‌పై వెంకటాపూర్‌‌‌‌కు వస్తుండగా లక్ష్మీపురం వద్ద రామప్ప వెళ్లేదారిలో అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు  డెడ్‌‌బాడీలను పోస్టుమార్గం కోసం అంబులెన్స్‌‌లో ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.

ఆటోబోల్తా పడి ఒకరు మృతి

కమలాపూర్, వెలుగు: హోలీ సంబరాలు జరుపుకొని వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఒకరు చనిపోయారు.  పోలీసుల వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు గంగారపు వినయ్ (డ్రైవర్‌‌‌‌), బొల్లం ప్రశాంత్, శనిగరపు సాయి, శనిగరపు వంశీ సోమవారం హోలీ సంబరాలు జరుపుకునేందుకు శనిగరం గ్రామానికి వచ్చారు.  సంబరాల అనంతరం మద్యం సేవించి.. ఆటోలో శనిగరం నుంచి చర్లపల్లికి బయల్దేరారు. గోపాల్‌‌ పూర్‌‌‌‌ గ్రామ శివారు వద్ద ప్రమాదశాత్తు ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో శనిగరపు వంశీ స్పాట్‌‌లోనే మృతి చెందగా, బొల్లారపు ప్రశాంత్, శనిగరపు సాయి, ఆటో డ్రైవర్ గంగారపు వినయ్ గాయాలు అయ్యాయి.  డెడ్‌‌బాడీతో పాటు గాయపడిన వారిని పోలీసులు, స్థానికుల సాయంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌‌కు తరలించారు.