సంక్షేమ హాస్టళ్లలో దోమల బెడద, నేలపైనే నిద్ర

సంక్షేమ హాస్టళ్లలో దోమల బెడద, నేలపైనే నిద్ర

 మహబూబ్ నగర్:  ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చలికాలంలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదులు, దోమల బెడద,  నేలపైనే నిద్ర సర్వ సాధారణం. అయితే తెల్లవారుజామునే చన్నీటి స్నానాలు చేయాల్సి రావడంతో కష్టాలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టళ్లోని విద్యార్థులు ఇరుకు గదుల్లో పడుకునే స్థలం లేక అవస్థలు పడుతున్నారు. పాత భవనాల్లో కిటికీలు ఊడిపోయి.. తలుపుల సందుల్లోంచి చల్లగాలులు వీస్తుంటే.. గజగజ వణికిపోతూ కునికిపాట్లు పడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల దోమల బెడద విద్యార్థులను కలత నిద్రకు.. తరచూ అనారోగ్యాలకు గురిచేస్తోంది. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీసీ హాస్టల్లో 53 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ హాస్టల్ లో విద్యార్థులు పడుకోవడానికి  కార్పెట్లు తప్ప ఏమీ లేవు. కిటికీలు ఊడిపోయి చలికి వణికిపోతున్నారు. కిటికీలకు టవల్స్ అడ్డుపెట్టుకుని చలి రాకుండా కాపాడుకుంటున్నారు. నేలపై కార్పెట్ పరుచుకుని పడుకుంటున్నారు.  హాస్టళ్లో దోమల బెడదకు రాత్రి నిద్ర పట్టడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. 

అలాగే మరగుదొడ్లు శుభ్రంగా లేవని చెబుతున్నారు. మరుగుదొడ్ల దగ్గర, గదుల్లో సరైన వెలుతురునిచ్చే లైట్లు లేవంటున్నారు. ఈ సమస్యలను హాస్టల్ వార్డెన్ విజయ ప్రకాశ్ దృష్టికి తీసుకెళ్లగా బడ్జెట్ లేక విద్యార్థులకు కొన్ని సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని చెబుతున్నారు. 

మానకొండూరులోని బీసీ వెల్ఫేర్ హాస్టళ్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ హాస్టల్ లో మొత్తం 160 మంది ఉంటున్నారు. అందరూ పడుకోవడానికి అవసరమైన బెడ్లు లేవు. కార్పెట్లు వేసుకుని ఇంటి నుంచి తెచ్చుకున్న పలచటి దుప్పట్లు కప్పుకొంటున్నారు. కిటీకీలు, తలుపులు విరిగిపోయాయి. రాత్రి పూట చల్లటి గాలి రాకుండా విరిగిన కిటికీలకు పాత కార్పెట్లు అడ్డుగా పెట్టుకుంటున్నారు. తగినంత నీటి సరఫరా.. తరచూ శుభ్రం చేసే వారు లేక మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. అంతేకాదు.. హాస్టల్ లో పెట్టే అన్నం సరిగా ఉండడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. కూరలు, చారులో ఎక్కువగా నీళ్లే ఉంటాయని చెబుతున్నారు.

తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని జ్యోతిభా ఫూలే గురుకుల బాలుర హాస్టల్ ను అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ 500 మంది విద్యార్థులున్నారు. కిటికీలు, తలుపులు ఉన్నా... పిల్లలకు సరిపడా బెడ్స్ లేక  చాలా మంది కింద పడుకుంటున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు డబుల్ డెక్ మంచాలు ఏర్పాటు చేశారు. చలికాలంలో చన్నీటి స్నానాలకు ఇబ్బంది అవుతోందని విద్యార్థులు చెబుతున్నారు. గీజర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

కరీంనగర్ కిసాన్ నగర్ లో పాతకాలం నాటి భవనంలో పోస్టు మెట్రిక్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్మీడియట్, ఆ పైన చదువుకునే ఎస్సీ విద్యార్థులు ఉంటున్నారు. గదులు సరిపోక  ఇరుకు గదుల్లో విద్యార్థులు సర్ధుకుంటున్నారు. ఒక్కో గదిలో 10 మంచాలుంటే దాదాపు 20 మంది వరకు పడుకుంటున్నారు. ఈ హాస్టల్లో ఓ గీజర్ ఉన్నా... 150 మంది విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు. పాత భవనం కావడంతో ఉన్నంతలో విద్యార్థులను అడ్జెస్ట్ చేస్తున్నామని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేశ్వరరావు చెబుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ సేమ్ టు సేమ్ 

రోజురోజుకు చలి తీవ్రత పెరిగడంతో రాత్రి పూట జాగారం చేస్తున్నారు వరంగల్ జిల్లాలోని హాస్టల్స్  విద్యార్థులు.  కొన్ని చోట్ల వసతి గృహాలకు సరిగా తలుపులు లేకపోవడం, కొన్ని చోట్ల కిటికీలు ఊడిపోవడంతో చలి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

హనుమకొండ జిల్లాలో  27 ఎస్సీ హాస్టల్లు ఉన్నాయి. ఇందులో 909 మంది విద్యార్థులు చదువుతున్నారు.  అలాగే బీసీ హాస్టల్స్ 15 ఉండగా.. వాటిలో 932 మంది విద్యార్థులు, 12 ఎస్సీ వెల్పర్ హాస్టల్స్ లో 2090 మంది విద్యార్థులు ఉంటున్నారు. అలాగే జిల్లాలోని 9 కస్తూర్భా వసతి గృహాల్లో 2336 మంది, 5 మైనారిటీ హాస్టల్స్  లో  1760 మంది విద్యార్థులు చదువుతున్నారు. హసన్ పర్తి దగ్గర ఊరికి  దూరంగా ఉనన  మహత్మ జ్యోతిరావుపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ 600 మంది  స్టూడెంట్స్ చదువుకుంటన్నారు. 

చుట్టూ కొండల మధ్య  హాస్టల్ ఉంది. గతంలో ప్రైవేటు విద్యా సంస్థ ఆధీనంలో ఉండగా.. ప్రస్తుతం దాన్ని అద్దెకు తీసుకుని రెసిడెన్సియల్ స్కూల్ నిడిపిస్తున్నారు. హాస్టల్  విశాలంగా ఉన్నా..  తరగతి గదుల కిటికీలు పగిలిపోయాయి. దీని వల్ల స్టడీ హవర్స్ సమయంలో చల్లని గాలులు వీస్తుండంటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన చద్దర్లు   చలికి సరిపోవడం లేదని విద్యార్ధులు చెబుతున్నారు. 0 వ తరగతి విద్యార్థుల వరకూ బెడ్స్ ఉన్నాయి. కానీ ఇంటర్ విద్యార్థులు కిందనే పడుకుంటున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ లోనూ ఇదే పరిస్థితి

మహబూబ్ నగర్ లో చలి తీవ్రతకు హాస్టళ్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. కొందరు తరచూ రోగాల బారిన పడుతున్నారు. దుప్పట్లు లేక అవస్థలు పడుతున్నారు. కిటికీల నుంచి వచ్చే చలిగాలులకు రాత్రిపూ నిద్రపట్టక జాగారం చేస్తున్నారు. దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. చలి చంపేస్తున్నా హాస్టల్ లో  ఇప్పటివరకు దుప్పట్లు ఇవ్వలేదన్నారు. 

తమ కష్టాల గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తే వారు వచ్చి స్వెట్టర్లు, టోపీలు, దుప్పట్లు కొనిచ్చి వెళుతున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత   విద్యార్థుల సంక్షేమానికిపెద్దపీట వేస్తున్నామని  ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా చాలా  హాస్టల్స్ లో  పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలకు అద్దం పడుతున్నాయి.