భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : చలికి తోడు చన్నీళ్ల స్నానాలతో స్టూడెంట్స్ వణికిపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌ను కార్పొరేట్ స్థాయికి చేర్చామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దయనీయంగా ఉంది. కేజీబీవీలతో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటున్న బాల, బాలికలు వేడి నీళ్లు రాకపోవడంతో చన్నీటి స్నానం చేయాలంటే వణికి పోతున్నారు. ఓ వైపు చలి వణికిస్తుంటే మరోవైపు బెడ్స్ లేక నేలపైనే స్టూడెంట్స్ నిద్రిస్తున్నారు.
వణికిస్తున్న చలి..
జిల్లాలో కొద్ది రోజులుగా చలి పెరగడంతో సామాన్య ప్రజలతో పాటు హాస్టల్ స్టూడెంట్స్ తిప్పలు పడుతున్నారు. జిల్లాలోని 14 కేజీబీవీల్లో గతంలో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్స్ మూలకు పడ్డాయి. ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా వేడి నీళ్లు అందని పరిస్థితి ఉంది. మరోవైపు బెడ్స్ లేకపోవడంతో నేలపైనే నిద్రిస్తున్నారు. కనీసం చాపలు, దుప్పట్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో బాలికలు ఇబ్బందులకు గురవుతున్నారు. పినపాక, ఇల్లందు, చండ్రుగొండ, పాల్వంచ, గుండాల, కొత్తగూడెం, బూర్గంపహాడ్, చర్ల, అన్నపురెడ్డిపల్లి, టేకులపల్లి, అశ్వారావుపేట, ముల్కలపల్లితోపాటు జిల్లా వ్యాప్తంగా పలు గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌లలో స్టూడెంట్స్ రోజూ స్నానాలు చేయకపోవడంతో చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని పలు గిరిజన ఆశ్రమ స్కూల్స్, హాస్టల్స్, గురుకులాల్లోగీజర్లు పని చేయడం లేదు. కొన్ని చోట్ల కిటికీలకు, బాత్రూంలకు తలుపులు కూడా లేకపోవడంతో రాత్రి పూట చలితో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు జ్వరం, జలుబుతో బాధ పడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి చలి తీవ్రత నుంచి స్టూడెంట్స్‌ను కాపాడాలని పేరెంట్స్‌తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
దుప్పట్లు ఇవ్వాలి..
చలి తీవ్రత పెరగడంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సౌలతులు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కేజీబీవీలు, హాస్టల్స్, గురుకులాల్లో వేడి నీటి సౌకర్యంతో పాటు దుప్పట్లు, చాపలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి. - మంజుల, పీడీఎస్‌యూ జిల్లా నాయకురాలు