- తలుపుల్లేని టాయిలెట్స్.. మర్రి చెట్టే డైనింగ్ హాల్
- అల్లీపూర్ బీసీ గురుకుల బాలుర స్కూల్‌లో దుస్థితి
రాయికల్, వెలుగు: వానొస్తే విద్యార్థులకు నిద్రుండదు.. తలుపుల్లేని టాయిలెట్స్.. క్లాస్ రూమ్‌లోనే పడుకోవడం.. ఇదీ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ బాయ్స్ బీసీ గురుకుల స్కూల్‌లో దుస్థితి. స్కూల్ లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. స్కూల్‌లోని 12 గదుల్లో సగానికి పైగా ఉన్న రేకుల షెడ్లు ఉండగా అవి పగిలిపోయి వానొస్తే ఊరుస్తున్నాయి. దీంతో విద్యార్థులు తడిసి ముద్దవుతున్నాయి. పైగా సరిపడా బెంచీలు లేక నేల పైనే కూర్చొని చదువుతున్నారు.
సరిపడా గదుల్లేక పొద్దంతా క్లాసులు వింటున్న రూముల్లోనే పడుకుంటున్నారు. స్కూల్‌లో కేవలం 12 టాయిలెట్స్ ఉండగా వాటికి కూడా డోర్లు లేవు. ఏదైనా అర్జెంట్ అయితే బయటకు వెళ్లాల్సిందే రెంటికి వస్తే ఊపిరి బిగబట్టి లైన్‌లో నిలబడాల్సిందేనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. స్కూల్ చుట్టూ కాంపౌండ్ లేకపోవడంతో విష పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. డైనింగ్ హాల్ లేక పోవడంతో మర్రిచెట్టు కింద నేలపై కూర్చొని భోజనాలు చేస్తున్నామని వాపోతున్నారు.