మెనూ ప్రకారం భోజనం పెట్టాలని స్టూడెంట్స్​ ధర్నా

  • పీడీఎస్​యూ ఆధ్వర్యంలో లంచ్ బాక్స్ లతో ర్యాలీ

ఖమ్మం టౌన్, వెలుగు:  ఖమ్మం నగరంలోని ఎన్ ఎస్పీ ప్రభుత్వ స్కూల్ స్టూడెంట్స్ కు మధ్యాహ్న భోజనం కాంట్రాక్టర్ మెనూ ప్రకారం పెట్టడం లేదని ఆరోపిస్తూ పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ తో లంచ్ బాక్స్ లు, ప్లేట్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్కూల్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా వెంకటేశ్ ​మాట్లాడుతూ స్టూడెంట్స్ కు మెనూ ప్రకారం కాకుండా నీళ్ల చారుతో భోజనం పెడుతున్నారని తెలిపారు. గురువారం కూడా ఇదే తీరుగా ఉండడంతో ఆందోళన చేపట్టామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో, వసతి గృహాల్లోని స్టూడెంట్స్ కు క్వాలిటీ భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్ తో స్టూడెంట్ శైలజ మృతి మరువక ముందే, మగనూరు స్కూల్ లో మధ్యాహ్నం భోజనం వికటించి 40 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ధర్నా వద్దకు డీఈవో సోమశేఖర శర్మ వచ్చి మాట్లాడారు. స్టూడెంట్స్ కు గురువారం వెంటనే తిరిగి భోజనం వండిపెడతామని, ఏజన్సీపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ధర్నా ను విరమించారు.