గద్వాల, వెలుగు: మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపిస్తూ కేటి దొడ్డి మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల స్కూల్ స్టూడెంట్స్ బుధవారం ఖాళీ ప్లేట్లతో గద్వాల కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడికి కాలినడకన బయలుదేరారు. స్కూల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరూర్ గ్రామం వద్దకు వచ్చాక, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకొని సముదాయించారు.
కేటి దొడ్డి మండల బీసీ గురుకులాన్ని ధరూర్ మండలంలోని మార్లబీడు గ్రామ సమీపంలో నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ కు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని వాపోయారు. ఈ విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగామని చెప్పారు. ఫుడ్ కాంట్రాక్టర్ ఇష్టారీతిన వ్యవరిస్తున్నాడని, వార్డెన్ పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
ఎస్ఐ విజయ్ కుమార్ పిల్లలను సముదాయించి ఆఫీసర్లతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో స్టూడెంట్స్ శాంతించారు. అనంతరం ప్రైవేట్ వెహికల్స్ లో స్టూడెంట్స్‌ను స్కూల్ కు పంపించారు. ఎస్సీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్వేతా ప్రియదర్శిని స్కూల్‌ను సందర్శించి మెనూ ప్రకారం భోజనం పెట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు.