తాండూరులో కాలేజీకి తాళం వేసి విద్యార్థుల ఆందోళన

తాండూరులో కాలేజీకి తాళం వేసి విద్యార్థుల ఆందోళన
  • చదువు చెప్పట్లేదని నిరసన 

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​ జిల్లా తాండూరులోని శ్రీసాయి డిగ్రీ కాలేజీకి తాళం వేసి విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేసి చదువు చెప్పకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాలేజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

కాలేజీలో సుమారు 300 మంది ఉండగా, గత నవంబర్‌‌‌‌ నుంచి అరకొరగా తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్నారు. కాలేజీ కరస్పాండెంట్ మల్లేశ్ యాదవ్ స్పందించి సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయలే..

ఎల్బీనగర్: ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయకుండా స్టూడెంట్​ను బయట నిల్చోబెట్టిన స్కూల్​యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. లింగోజిగూడలోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట బాధిత పేరెంట్స్ తో  కలిసి సోమవారం ఆయన ఆందోళనకు దిగారు. 

రూ. 7 వేల ఫీజు చెల్లించలేదని స్టూడెంట్​ను క్లాస్ బయట నిలబెట్టిన పాఠశాల యజమాన్యం.. గత 8 ఏండ్లుగా జీహెచ్ఎంసీకి రూ. 14.63  లక్షలు బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. ఆ పాఠశాలపై ఏం చర్యలు తీసుకుంటారని అధికారులను ప్రశ్నించారు. ప్రిన్సిపాల్ తో గట్టిగా వాదించిన తర్వాత విద్యార్థిని పరీక్షకు అనుమతించినట్లు కార్పొరేటర్ తెలిపారు.