ఫేక్ సర్టిఫికెట్లతో సీట్లు కొట్టేశారు

ఫేక్ సర్టిఫికెట్లతో సీట్లు కొట్టేశారు
  •     స్థానికత లొసుగుతో ఏపీ స్టూడెంట్ల మోసం..
  •     తెలంగాణలో చదవకపోయినా దొడ్డిదారిన స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లు
  •     ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు
  •     నిరుడు 20 మందిపై కేసు రిజిస్టర్ చేసిన హెల్త్ వర్సిటీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో చదవకపోయినా.. చదివినట్టు ఫేక్ స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లతో ఏపీ స్టూడెంట్లు ఇక్కడి మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందారు. వీరికి తెలంగాణలోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ సహకరించాయి. స్థానికత రూల్స్​లో ఉన్న లొసుగులతో పదేండ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎవరూ గుర్తించలేదు. గతంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఏడేండ్లలో నాలుగేండ్లు తెలంగాణలో చదివితే ఇక్కడి స్టూడెంట్లుగా గుర్తించేవారు. 

గత బీఆర్ఎస్ పాలనలో ఇదే కొనసాగింది. ఈ నిబంధనను కాంగ్రెస్ సర్కార్ మార్చింది. ఏపీ స్టూడెంట్ల ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడటంతో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వరుసగా నాలుగేండ్లు ఇక్కడ చదివితేనే తెలంగాణ స్టూడెంట్లుగా గుర్తించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో 33ని జారీ చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారమే ఎంబీబీఎస్ అడ్మిషన్లు నిర్వహిస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ 3 రోజుల కింద ప్రకటించింది. 

దీంతో తమకు అన్యాయం జరుగుతున్నదంటూ కొంత మంది స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. వీరి పక్షాన మాట్లాడే సాకుతో, జీవో 33తో ఏపీ స్టూడెంట్లకు లబ్ధి జరుగుతున్నదంటూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేత కేటీఆర్ కొత్త రాగం ఎత్తుకున్నారు. జీవో 33తో తెలంగాణ స్టూడెంట్లకు అన్యాయం జరుగుతున్నదని విమర్శించారు. వాస్తవానికి.. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఏపీ స్టూడెంట్స్‌‌‌‌కు లబ్ధి చేకూరే అవకాశం లేదనేది స్పష్టమవుతున్నది.

పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ సర్కార్

ఏపీకి చెందిన చాలా మంది స్టూడెంట్స్‌‌‌‌ టెన్త్ క్లాస్ వరకు ఏపీలో చదివి, హైదరాబాద్‌‌‌‌లో ఇంటర్ చేస్తున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు తెలంగాణలో చదవకపోయినా, చదివినట్టుగా ఇక్కడి ప్రైవేటు స్కూళ్ల నుంచి దొడ్డిదారిన స్టడీ కండక్ట్‌‌‌‌ సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నరు. ఈ సర్టిఫికెట్లతో తెలంగాణలో మొత్తం నాలుగేండ్లు చదివినట్టుగా చూపించి, ఇక్కడి మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందుతున్నరు. 

గత పదేండ్లలో ఇలా ఎంతో మంది చేసినా అధికారులు గుర్తించలేకపోయారు. నిరుడు కూడా ఇలాగే 20 మంది ఏపీ స్టూడెంట్స్ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలంగాణలో చదివినట్టుగా పలు ప్రైవేటు స్కూళ్ల నుంచి స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లు తీసుకొచ్చారు. ఇవే సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్​కు అటెండ్ అయ్యారు. ఇందులో ఏడుగురికి మన స్టేట్‌‌‌‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు అలాట్ అయ్యాయి. కాలేజీలో జాయిన్ అయ్యే సమయంలో వారి సర్టిఫికెట్లను పరిశీలించిన ఓ అధికారికి అనుమానం కలిగింది. 9వ తరగతి వరకు తెలంగాణలో చదివి.. టెన్త్, ఇంటర్ ఏపీలో చదవడం ఏంటన్న అనుమానంతో ఆయన వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. 

ఏడుగురి ఎంబీబీఎస్ సీట్లు రద్దు

వర్సిటీ అధికారులు పోలీసులతో ఎంక్వైరీ చేయించగా, మొత్తంగా 20 మంది తెలంగాణలోని వివిధ స్కూళ్ల నుంచి దొడ్డిదారిన స్టడీ కండక్ట్‌‌‌‌ సర్టిఫికెట్లు పొందినట్టు తేలింది. దీంతో ఏడుగురి ఎంబీబీఎస్ సీట్లను యూనివర్సిటీ రద్దు చేసింది. అందరి మీద పోలీసులు ఎఫ్‌‌‌‌ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానికత గుర్తింపు విషయంలో నిబంధనలను సడలించాలని గతంలోనే ప్రభుత్వానికి అధికారులు సూచించారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు ఇక్కడ చదవాలన్న నిబంధనను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఈ నిబంధననే పరిగణనలోకి తీసుకుని, జీవో 33 విడుదల చేసింది.

సరిహద్దు ప్రాంతాల స్టూడెంట్ల విషయంలో పునరాలోచన!

మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లోని కొంత మంది స్టూడెంట్స్ తమ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఏపీలోని కర్నూల్, గుంటూరు, మహారాష్ట్రలోని నాగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో ఇంటర్ చదువుతున్నారు. సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన జీవోతో వీరు లోకల్ స్టేటస్‌‌‌‌ కోల్పోతున్నారు. కొత్త నిబంధనలతో తమ పిల్లలకు అన్యాయం జరుగుతున్నదంటూ కొంత మంది పేరెంట్స్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తమ పిల్లలు తెలంగాణలోనే పుట్టి పెరిగారని, టెన్త్ క్లాస్ వరకూ తెలంగాణలోనే చదివినందున స్థానికులుగా గుర్తించాలని కోరుతున్నారు. అయితే, ఇలాంటి వారి విషయంలో ఏం చేస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

పాత నిబంధనలు కొనసాగించలేం

లోకల్ స్టేటస్ విషయంలో గతంలో ఉన్న నిబంధనలు కొనసాగించడం సాధ్యం కాదు. ఏపీ పునర్విభజన యాక్ట్ ప్రకారం తెలంగాణ, ఏపీకి ఉన్న 15% అన్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌డ్ కోటా గడువు ముగిసింది. అందుకే అన్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌డ్‌‌‌‌ కోటాను రద్దు చేస్తూ, గతంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ తీసుకొచ్చిన జీవో 114లో మార్పులు చేశాం. కొత్తగా జీవో 33ని తీసుకొచ్చాం. జీవో 114 ప్రకారం లోకల్ స్టేటస్ నిర్ణయించడానికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదివి ఉండాలి లేదా ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్న ఏండేండ్లలో ఏవైనా నాలుగేండ్లు తెలంగాణలో, మూడేండ్లు ఏపీలో చదివి ఉండాలి అనే రెండు క్లాజ్‌‌‌‌లు ఉన్నాయి. అన్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌డ్ కోటా గడువు ముగిసినందున సెకండ్ క్లాజ్‌‌‌‌ను తొలగించాం. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో చదవాలన్న నిబంధన మాత్రమే కొన సాగించాం. ఇదేమీ మేము కొత్తగా తీసుకొచ్చిన రూల్ కాదు. 

- దామోదర రాజనర్సింహా, హెల్త్ మినిస్టర్