అచ్చంపేట ప్రైవేట్​ హాస్టల్‌లో 34 మంది స్టూడెంట్లకు అస్వస్థత

అచ్చంపేట ప్రైవేట్​ హాస్టల్‌లో 34 మంది స్టూడెంట్లకు అస్వస్థత

అచ్చంపేట, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేటలోని ఆక్స్​ఫర్డ్ ప్రైవేట్ ​స్కూల్​ హాస్టల్​లో గురువారం విద్యార్థులు ఫుడ్​పాయిజన్​తో అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ హాస్టల్​సౌకర్యం కూడా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉండి  చదువుకుంటున్నారు. గురువారం ఉదయం చపాతీతో పాటు పెసరపప్పుతో కూడిన బ్రేక్​ఫాస్ట్​ పిల్లలకు పెట్టారు. ఇది తిన్న కాసేపటికే విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. 

వాంతులు కూడా కావడంతో రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న  34 మందిని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. టిఫిన్ శాంపిల్స్ ల్యాబ్​కు పంపి రిపోర్ట్​వచ్చాక వివరాలు వెల్లడిస్తామని డీసీఎంఎస్  రామకృష్ణ చెప్పారు.  డీఈవో గోవిందరాజులు స్కూల్ పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. డీఎంహెచ్ వో స్వరాజ్యలక్ష్మి దవాఖానకు వెళ్లి స్టూడెంట్ల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాగా, కలుషిత ఆహారంతోనే తమ పిల్లలు 

అస్వస్థతకు గురయ్యారని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. స్కూల్​ను అచ్చంపేట డిప్యూటీ డీఎంహెచ్​వో తారాసింగ్, డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ రాములు 
విజిట్​చేశారు.