
- స్కాలర్‌షిప్‌ను రూ.10 వేలకు పెంచాలె
- అగ్రికల్చర్ వర్సిటీ స్టూడెంట్ల ఆందోళన
గండిపేట్, వెలుగు: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ స్టూడెంట్లు మంగళవారం ఆందోళనకు దిగారు. క్లాసులు బహిష్కరించి ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తాము చేసిన రీసెర్చ్‌లను పరిగణనలోకి తీసుకోవాలంటే అవి ఆరు రేటింగ్స్ ఉన్న జర్నల్స్‌లో ప్రచురితమవ్వాలనే కొత్త రూల్ తీసుకొచ్చారని స్టూడెంట్లు తెలిపారు. వర్సిటీ అధికారులు తెచ్చిన ఈ కొత్త రూల్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాము చేసిన రీసెర్చ్ సిక్స్ రేటింగ్ ఉన్న జర్నల్స్‌లో ప్రచురితం కావాలంటే సుమారు ఏడాదిపైన సమయం పడుతుందని వాపోయారు. ఫలితంగా ఏడాది పాటు తాము పట్టా అందుకోలేకపోవటమే కాకుండా.. ఏ ఉద్యోగానికి అర్హులం కాలేమని ఆవేదన వ్యక్తం చేశారు.
రీసెర్చ్ కోసం ఒక విద్యార్థికి లక్ష రూపాయల గ్రాంట్ మాత్రమే వస్తుందని దానివల్ల పూర్తిస్థాయిలో పరిశోధనలు చేయలేకపోతున్నట్లు వివరించారు. అందువల్ల గతంలో మాదిరిగానే ఫైవ్ రేటింగ్ జర్నల్స్‌లో ప్రచురితమైన పరిశోధనలను పరిగణనలోకి తీసుకొని పట్టాలను అందజేయాలని ప్రభుత్వాన్ని స్టూడెంట్లు కోరారు. రీసెర్చ్ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని.. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని స్టూడెంట్లు హెచ్చరించారు.