కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లాలో మిస్సింగ్ అయిన గురుకుల విద్యార్థులను పోలీసులు వెతికి పట్టుకున్నారు. కోదాడ మండలం దోరకుంట ఆవాస గ్రామమైన నెమలిపురి ఎస్సీ బాలుర గురుకులఈకు చెందిన ఆరుగురు పదో తరగతి విద్యార్థులు కనిపించడం లేదని పాఠశాల నిర్వాహకులు ఆదివారం కోదాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అనిల్ రెడ్డి స్కూల్ కు వెళ్లి సహ విద్యార్థులు, టీచర్ల నుంచి సమాచారాన్ని తెలుసుకున్నారు.
పోలీసు బృందాలతో ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని పీఎస్ లో సమాచారం పంపారు. అయితే.. విజయవాడ రైల్వే స్టేషన్ లో ఉన్నారని సోమవారం తెల్లవారుజామున తెలియడంతో వెళ్లి పట్టుకుని వచ్చారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు పాఠశాల నుంచి వెళ్లిపోవడానికి గత కారణాలపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్లోని విద్యార్థులను మందలించలేదని ప్రిన్సిపల్ ఝాన్సీ తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని, ఉపాధ్యాయుల తప్పేమీ లేదని ఆమె పేర్కొన్నారు.