- దీనిపై యువత బాధ్యత తీసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు, కాలేజీల్లో డ్రాపౌట్స్ తగ్గించాలని.. ఇది యువతరంపై ఉన్న అతిపెద్ద బాధ్యతని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువత విద్యను నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడొద్దని సూచించారు. డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మంచిర్యాలకు చెందిన సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలను సీఎం అడిగి తెలుసుసుకున్నారు. సొంత హాస్టల్ భవనాలు నిర్మించాలని విద్యార్థులు కోరగా.. స్థానిక అధికారులతో స్థల సేకరణ చేయించి హాస్టల్ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.." గత పదేండ్లల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది. మేం ఇప్పుడు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నం. స్కూళ్లకు, కాలేజీలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నం. స్కిల్ వర్సిటీతో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. త్వరలో స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం"అని సీఎం వెల్లడించారు.
రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు
రాజకీయ పార్టీల నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దని స్టూడెండ్లకు సీఎం సూచించారు. విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమేనన్నారు. యువజన సంఘాలు బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్పించేలా చొరవ చూపాలని కోరారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పాఠశాలల్లో విద్యతో పాటు సామాజిక అవగాహన కల్పించేలా టీచర్లు గ్రూప్ డిస్కషన్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉన్నత చదువులు చదువుకుని... తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని స్టూడెంట్లకు సీఎం చెప్పారు.