టెన్త్ నుంచి పీజీ వరకు జరిగే పరీక్షలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయం వీడితే ప్రతి పరీక్షలో విజయం మీదే. మీపై నమ్మకంతో మీరు పరీక్షలు రాయండి. ఈ నాలుగు నెలల్లో జరిగే అన్ని పరీక్షలు విద్యార్థులకు మాత్రమే కాదు, ఇటు తల్లిదండ్రులకు, చదువులు బోధించిన గురువులకు కూడా పరీక్షలే. ఈ పరీక్షలే మీ భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతాయి. విద్యార్థులు సహనంతో చదివే ప్రయత్నం చేస్తే ఉత్తీర్ణత సాధించడం చాలా సులభం. మీరు సాధించే విజయం కోసం మీ తల్లిదండ్రులే కాదు, మీ పాఠశాల ఉపాధ్యాయులు, మీకు విద్యను బోధించిన గురువులు కూడా ఎదురుచూస్తున్నారు. మా కష్టానికి ప్రతిఫలం ఎలా ఉంది అని తల్లిదండ్రులు అటు మా విద్యను ఎలా అందించాం అని గురువులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎవ్వరికైనా మీరు ఏమిటి అనేది తెలియజేసేది మీ ఉత్తీర్ణతే. ఎవ్వరి ఆలోచనలు ఎలా ఉన్నా ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను మననం చేసుకుంటూ విజయమే లక్ష్యంగా చదవండి. ఈ పరీక్షా కాలం ముగిసేవరకు మొబైల్ ఫోన్స్, ఇంటర్ నెట్, చాటింగ్, సినిమాలు, షికార్లు అన్నిటిని వదిలేయండి.
మీరు రాసే ప్రతి పరీక్షా మీ భవిష్యత్తుకు ముడిపడి ఉంటుంది. మీరు రాసే ప్రతి సబ్జెక్టు ప్రాముఖ్యమైనదే. ఒక సబ్జెక్టు సులువుగా ఉందని ఉదాసీనంగా ఉండకండి. సాధించే ప్రతి మార్కు మీ గమ్యాన్ని మీకు చేరువ చేస్తుంది. మీరు ఇప్పుడు చదువు కోసం పడే శ్రమనే మీ భవిష్యత్తుకి మంచి మార్గాన్ని చూపిస్తుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆందోళన, కంగారు, అనాలోచితమైన ఆలోచనలను దరి చేరనీయకుండా ఏకాగ్రతతో ప్రశాంతంగా చదవండి. అర్థం చేసుకుంటూ వెళ్లగలిగితే ప్రశాంతంగా అన్ని పరీక్షలను, పోటీ పరీక్షలను కూడా సులువుగా, సునాయాసంగా ఎదుర్కోవచ్చు. మీ ఆలోచన, మీ ప్రయత్నం, మీ శ్రమ, మీ చదువుతో మీకు మీరే సాటి అని నిరూపించండి. విజయం సాధించండి. మీ విజయమే మీ తల్లిదండ్రులు పడే కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది. తల్లిదండ్రులకు, చదువు నేర్పించిన గురువులకు మీ విజయమే మీరు ఇచ్చే అద్భుతమైన బహుమతి.
వై. సంజీవ కుమార్