గీతాంజలి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోండి: విద్యార్థుల తల్లిదండ్రులు

గీతాంజలి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కూకట్ పల్లి వివేకానంద నగర్ డివిజన్ సప్తగిరి కాలనీలోని గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ ముందు తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. స్కూల్ మారే విద్యార్థులకు టీసీ ఇవ్వడానికి గీతాంజలి స్కూల్ యాజమాన్యం నిరాకరించడంతో ఆందోళన చేపట్టారు. తల్లిదండ్రులు వారి పిల్లలను వేరే స్కూల్ లో చేర్పించేందుకు అవసరమైన టీసీని ఇవ్వడానికి స్కూల్ యాజమాన్యం నిరాకరించడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులపై అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. 

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయిలో ఫీజు చెల్లించినప్పటికీ.. వేరే పాఠశాలకు మారెందుకు టీసీ అడిగితే మరిన్ని డబ్బులు కడితేనే టీసీ ఇస్తామంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. స్కూలు మారే ఉద్దేశం తమకున్నా టీసీ పేరుతో కాలయాపన చేస్తూ.. తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు తల్లిదండ్రులు.