కొడిమ్యాల, వెలుగు : టీచర్లు లేక తమ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారని, కనీసం ఏబీసీడీలు వస్తలేవని, ఎక్కాలు చెప్పలేకపోతున్నారని, వెంటనే టీచర్లను నియమించాలని జగిత్యాల మండలం కొడిమ్యాల తహసీల్దార్ఆఫీసులో జరిగిన ప్రజావాణిలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో 86 మంది చదువుతుండగా, వీరికి కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లు అవసరం కాగా గతంలో ఒక్క టీచర్మాత్రమే ఉండేవారు. సమస్యను ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్తే మరో టీచర్ను అడ్జస్ట్ చేశారు.
అప్పటి నుంచి ఈ ఇద్దరితో పిల్లలందరికీ పాఠాలు చెప్పడం సాధ్య కావడం లేదు. దీంతో అందరినీ ఒకే చోట కూర్చుండబెట్టి గంపగుత్త చదువులు చెప్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో 30 మంది స్టూడెంట్ల తల్లిదండ్రులు సోమవారం తహసీల్దార్ఆఫీసులోని ప్రజావాణికి తరలివచ్చారు. టీచర్లతో పాటు అటెండర్ గాని స్కావెంజర్ గాని లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే టీచర్లను రిక్రూట్ చేసి స్టూడెంట్ల చదువుకునేందుకు సాయం చేయాలని కోరారు.