1952లో చేపట్టిన గైర్‌ముల్కీ ఉద్యమం, 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం, 1996 తర్వాత చేపట్టిన మలిదశ ఉద్యమంలో విద్యార్థి సంఘాలు పోరాడాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు కీలక పాత్ర పోషించాయి.
2009 నవంబర్ 1న తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు తెలంగాణ విద్రోహ దినం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం పూర్తిగా విద్యార్థుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అనంతరం 2009, డిసెంబర్ 10న చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
Also Rard: కేఎంసీలో మరోసారి ర్యాగింగ్..జూనియర్ మెడికోను కొట్టిన సీనియర్లు
ఈ కార్యక్రమం జరిగే లోపే 2009, డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.
విద్యార్థి గర్జన సభ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2010 జనవరి 3న విద్యార్థి జేఏసీ విద్యార్థి గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. 2010, జనవరి 8న తెలుగు విశ్వవిద్యాలయంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది.
విదార్థి రణభేరి: నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో 2010 జనవరి 23న విద్యార్థి రణభేరి అనే పేరుతో సభను నిర్వహించారు. ఈ సభకు సుష్మాస్వరాజ్ హాజరయ్యారు.
నా రక్తం నా తెలంగాణ: సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ఏబీవీపీ విద్యార్థులు తెలంగాణ వ్యాప్తంగా నా రక్తం– నా తెలంగాణ పేరుతో 2010 జనవరి 30న 20 వేల మందితో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు.
విద్యార్థి పొలికేక సభ: తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడానికి విద్యార్థులు పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్ర వరంగల్‌లో ముగింపు సందర్భంగా 2010 ఫిబ్రవరి 7న కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పొలికేక సభ నిర్వహించారు.
మరికొన్ని కార్యక్రమాలు
ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకపోవడంతో 2010 ఫిబ్రవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీ సన్నాహక కార్యక్రమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని ఆర్ట్స్ కాలేజీ నుంచి తర్నాక వైపునకు విద్యార్థులు ప్రదర్శనగా వెళ్తున్న సమయంలో పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
- 2010 ఫిబ్రవరి 20న అసెంబ్లీ ముట్టడిలో భాగంగా ఆర్ట్స్ కళాశాల నుంచి ర్యాలీగా విద్యార్థులు ఎన్సీసీ గేటు విద్యానగర్ వైపు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ముళ్లకంచెలు, భారీకేడ్లతో ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే సిరిపురం యాదయ్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ పరిగెత్తాడు. అనంతరం హాస్పిటల్లో యాదయ్య మరణించారు.
- ఉస్మానియా క్యాంపస్ నుంచి పారామిలటరీ దళాలను వెనక్కి పిలవాలనే డిమాండ్‌తో విద్యార్థుతు 2011 జనవరి 11న చలో ఉస్మానియా కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
- 2011 ఫిబ్రవరి 21న మరోసారి విద్యార్థులు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు లాఠీఛార్జీ చేయడంతోపాటు విద్యార్థులను అరెస్టు చేశారు. అయినా కొంత మంది విద్యార్థులు అసెంబ్లీ వరకు చేరుకొని తెలంగాణ నినాదాలు చేశారు.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 2011 జులై 11న ఉస్మానియా విశ్వ విద్యాలయంలో విద్యార్థులు సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభించి నాలుగు రోజుల అనంతరం జులై 14న విరమించారు.
- 2013 జనవరి 24న తెలంగాణ అమలు ప్రకటన కోరుతూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ వరంగల్‌లో తెలంగాణ విద్యార్థి బహిరంగ సభను నిర్వహించారు.
- 2013 జనవరి 28న తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ తెలంగాణ విద్యార్థి మహాప్రదర్శనను నిర్వహించింది.
- 2013, జనవరి 14న నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో విద్యార్థులే అసెంబ్లీకి చేరుకుని తెలంగాణ నినాదాలు చేశారు.
- 2013 సెప్టెంబర్ 21న ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి యుద్ధభేరి సభ జరిగింది.
ప్రవాస భారతీయులు
తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం: నారాయణస్వామి చైర్మ్‌న్‌గా, మారోజు వెంకట్ అధ్యక్షుడిగా, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరంను ఏర్పాటు చేశారు. 2013, మేలో లండన్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఫోరం వ్యవస్థాపకులు గంప వేణుగోపాల్, అనిల్ కుర్మాచలంలు ఆవిష్కరించారు.
కాకతీయ ప్రవాస భారతీయుల సంఘం: 2010 జూన్‌లో ఆరు జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రెండు విద్యార్థి కుటుంబాలను గుర్తించి ఆర్థిక సాయం చేశారు. 2010 నవంబర్‌లో కళల తెలంగాణ పేరుతో తెలంగాణ భావజాలాన్ని సంస్కృతిని, చారిత్రక విలువలను, పోరాట పటిమలు చూపించే చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు బాగ్‌లింగంపల్లిలోని బి.ఆర్.అంబేద్కర్ కళాశాలలో నిర్వహించారు. కాకతీయ ప్రవాస భారతీయుల సంఘంలో జోగినిపల్లి ఆదిత్య (అధ్యక్షుడు), దొంగరి ప్రశాంత్ (ప్రధాన కార్యదర్శి)లు కీలకపాత్ర పోషించారు.
మెల్బోర్న్ తెలంగాణ ఫోరం: 2012లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వి.ప్రకాష్ ప్రోత్సాహంతో మెల్బోర్న్ తెలంగాణ ఫోరాన్ని నూకల వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 2013, ఆగస్టు 18న ఈ ఫోరం కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి వ్యవస్థాపక అధ్యక్షునిగా నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అనిల్దీప్ గౌడ్ ఎన్నికయ్యారు. 2013 అక్టోబర్ 6న మెలోబోర్న్ తెలంగాణ ఫోరం బతుకమ్మ పండుగను నిర్వహించింది. 2014, సెప్టెంబర్ 27న బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల అనంతరం మెల్బోర్న్ తెలంగాణ ఫోరానికి నూతన అధ్యక్షుడిగా రాజేశ్‌రెడ్డి ఎన్నికయ్యారు.