కరీంనగర్ జ్యోతి బాపూలే గురుకులంలో విద్యార్థుల గోస

కరీంనగర్ జ్యోతి బాపూలే గురుకులంలో విద్యార్థుల గోస
  • ఉన్నవి 30 బాత్రూమ్​లే  
  • స్నానానికి  తెల్లవారుజాము నుంచే క్యూలు
  • మంచాల్లేక కిందనే పడక 
  • పెచ్చులూడి ఉరుస్తున్న భవనం 

కరీంనగర్, వెలుగు : అద్దె బిల్డింగులో కొనసాగుతున్న కరీంనగర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్​లో అన్నీ సమస్యలే. కనీస వసతులు కూడా లేకపోవడంతో విద్యార్థులు కష్టాలు పడుతున్నారు.  400 మందికి సరిపోయే బిల్డింగులో దాదాపు వెయ్యి మందిని ఉంచడంతో రూమ్స్, టాయిలెట్లు సరిపోక గోస పడుతున్నారు. పడుకునేందుకు మంచాలు కూడా లేక కిందనే నిద్రపోతున్నారు. పైగా బిల్డింగ్ లోతట్టు ప్రాంతంలో ఉండడంతో వర్షం పడితే చుట్టూ వరద చేరుతోంది. గుంతల్లో నీళ్లు నిలిచి దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నారు.  

బాత్ రూమ్ లకు డోర్లు లేవ్..   

బొమ్మకల్ బైపాస్ రోడ్డులో మొదట గురుకుల స్కూల్ ఏర్పాటు చేశారు. ఏడాది కింద దీన్ని కాలేజీగా అప్ గ్రేడ్ చేశారు. స్తంభంపల్లి, సుల్తానాబాద్, సింగరావు పేట, సైదాపూర్, సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన ఇంటర్ స్టూడెంట్లను ఇందులో చేర్చారు. ఈ బిల్డింగ్​లో స్కూల్ స్టూడెంట్లకే వసతుల్లేక తల్లడిల్లుతుంటే అదనంగా ఇంటర్ స్టూడెంట్లను తీసుకురావడంతో సమస్యలు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం పాఠశాల విద్యార్థులు 480 మంది ఉండగా, కాలేజీ విద్యార్థులు 528 మంది ఉన్నారు. వీళ్లందరికీ కేవలం 20 టాయిలెట్లు, 30 బాత్​రూమ్స్​మాత్రమే ఉన్నాయి. దీంతో ఇవి సరిపోక విద్యార్థులు తెల్లవారుజామునే లేచి క్యూ కట్టాల్సి వస్తోంది. సమయం సరిపోక పొద్దున కొందరు, సాయంత్రం మరికొందరు స్నానాలు చేస్తున్నారు. ఇంకొంతమంది రెండు రోజులకోసారి స్నానాలు చేయాల్సి వస్తున్నది. మరోవైపు బాత్​రూమ్​లు కూడా సరిగ్గా లేవు. కొన్నింటికి  డోర్లు లేక చెక్కలు అడ్డు పెట్టారు. టాయిలెట్లు క్లీన్ చేయక కంపు కొడుతున్నాయి. డ్రైనేజీ సిస్టమ్​సరిగ్గా లేదు. ​పైకి బిల్డింగ్​బాగానే కనిపించినా లోపల గదుల్లో పెచ్చులూడి.. వర్షం పడితే ఉరుస్తోంది. 

ఏడాదైనా మంచాల్లేవ్.. 

ఈ హాస్టల్​లో ఐదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు మాత్రమే బెడ్స్​ఉన్నాయి. మూడో ఫ్లోర్ ఇంటర్ స్టూడెంట్స్​కు కేటాయించగా, వచ్చి ఏడాదవుతున్నా ఇప్పటి వరకు ఒక్క మంచం ఇవ్వలేదు. అందరూ కిందనే పడుకుంటున్నారు. స్కూల్ ​పిల్లల విషయానికి వస్తే వీరి రూముల్లో వర్షం పడితే పక్క రూముల్లోకి వెళ్లి మిగతా పిల్లలతో కలిసి సర్దుకుపోతున్నారు. ఒక్కో మంచంపై ఇద్దరు పడుకుంటున్నారు. ఫ్యాన్లు సరిగ్గా పని చేయడం లేదు. కొన్నింటి రెక్కలు విరిగిపోయాయి. వర్షం వస్తే ప్రాంగణంలో నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారుతోంది. దీంతో చాలామంది జ్వరాల బారిన పడ్డారు. 

వేరే బిల్డింగ్ కు మారుస్తం..

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తున్నాం. వేరే బిల్డింగ్​లోకి మార్చడానికి సెక్రటరీ అనుమతి ఇచ్చారు. నెల రోజుల్లో అందరినీ వేరే భవనానికి షిఫ్ట్​చేస్తం.

–  రాజమౌళి, ప్రిన్సిపల్