పెండింగ్ స్కాలర్ షిప్స్​ను రిలీజ్​ చేయాలని ధర్నా

పెండింగ్ స్కాలర్ షిప్స్​ను రిలీజ్​ చేయాలని ధర్నా

వనపర్తి టౌన్, వెలుగు: -పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రాఘవ, ఎం.ఆది మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేద విద్యార్థుల చదువులపై చిన్న చూపు చూసిందన్నారు. గత ఆరేళ్ళ నెఉంచి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులను మధ్యలోనే మానేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

ఆరు సంవత్సరాల నుంచి మొత్తం 8,214 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉన్నాయన్నారు. విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు ప్రభుత్వం టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. గవర్నమెంట్ స్కూళ్లల్లో ఉపాధ్యాయులు లేక రోడ్లపైకి విద్యార్థులు వచ్చి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వనపర్తి జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశ్​, అనిల్, జిల్లా కమిటీ సభ్యులు సాయి, రమేశ్​, నీలోత్పల్, వెంకటేష్ ,పూజ ,శ్వేత, రాజ వర్ధన్, లక్ష్మణ్, రాజేశ్​ పాల్గొన్నారు. 

ఆమనగల్లు, వెలుగు : పెండింగ్ స్కాలర్ షిప్ లను, ఫీజు రియీంబర్స్​మెంట్​ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22న నిర్వహించే చలో కలెక్టరేట్ పోస్టర్ ను ఆయన గురువారం ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఆమనగల్లు లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి ఏండ్లు గడుస్తున్న నేటికీ భవనం లేదని, విద్యార్థులు చెట్ల కింద చదువుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి స్టాలిన్, నాయకులు శివ, సాయి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.