- ఆసిఫాబాద్ ఆదర్శ స్కూల్ నుంచి బదిలీపై వెళ్లిన 17 మంది టీచర్లు
- ఇద్దరే ఉండగా.. చదువులు సాగడం లేదంటూ స్టూడెంట్స్ నిరసన
ఆసిఫాబాద్, వెలుగు: స్కూల్ లో సరిపడా టీచర్లు లేక తమ చదువులు సాగడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాస్తారోకోకు దిగగా అధికారులు, పోలీసులు వెళ్లి విద్యార్థులకు నచ్చజెప్పినా వినలేదు. కలెక్టర్ హామీతో విరమించి స్కూల్ కు వెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సుమారు 807 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత శనివారం స్కూల్ నుంచి17 మంది టీచర్లు వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యారు.
ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. దీంతో తమ చదువులు సాగడం లేదని టీచర్లు కావాలని గురువారం స్టూడెంట్స్ స్కూల్ నుంచి పాదయాత్రగా సాయిబాబా ఆలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇన్ చార్జ్ డీఈవో ఉదయ్‌బాబు, డీఎస్పీ కరుణాకర్, సీఐ సతీశ్ వెళ్లి స్టూడెంట్స్ కు నచ్చజెప్పినా వినకుండా గంటపాటు రాస్తారోకో చేశారు. విద్యార్థుల్లో కొందరిని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే వద్దకు అధికారులు తీసుకెళ్లారు.
తమ సమస్యలపై విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందిస్తూ.. బదిలీ అయిన టీచర్లు తిరిగి వస్తామంటే రప్పించేందుకు సిద్ధమేనని, అప్పటివరకు తాత్కాలికంగా టీచర్లను నియమించి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు తిరిగి స్కూల్ కు వెళ్లిపోయారు.