ప్రిన్సిపల్​ వద్దంటూ  విద్యార్థుల ఆందోళన

ప్రిన్సిపల్​ వద్దంటూ  విద్యార్థుల ఆందోళన
  • ఇబ్బందులు పెడుతోందని  రోడ్డెక్కిన ఎంజేపీ విద్యార్థులు
  • ప్రిన్సిపల్​ను సస్పెండ్​ చేసిన అధికారులు 

జగిత్యాల రూరల్ వెలుగు: ‘ప్రిన్సిపల్  మాకు వద్దంటూ’  జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ ఎంజేపీ పాఠశాల  విద్యార్థులు  శనివారం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్కూలుకు వచ్చే తమ తల్లిదండ్రులతో సరిగా మాట్లాడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే అసభ్య పదజాలంతో దూషిస్తుందని పేర్కొన్నారు. హాస్టల్ కి ఆలస్యంగా వచ్చిన వారి  నుంచి ఫైన్ పేరిట డబ్బులు  వసూలు చేస్తోందని,  ప్రశ్నిస్తే స్కూల్ డెవలప్మెంట్ కు ఖర్చు చేస్తామని చెబుతుందని తెలిపారు.

 కాస్మోటిక్ చార్జీలు  ఇవ్వడం లేదని ఆరోపించారు. వర్షాకాలం డార్మెటరీ  హాల్ లోకి నీళ్లు వచ్చి లగేజ్ తడుస్తోందని, నిద్రించడానికి అవస్థలు పడుతున్నామని తెలిపారు. స్కూల్ టీచర్లతో తమకు సమస్య లేదన్నారు.  ప్రిన్సిపాల్ ను ట్రాన్స్ఫర్ చేయాలనీ కోరారు. అనంతరం టీచర్లు వచ్చి సర్ది చెప్పడంతో స్టూడెంట్స్ తిరిగి హాస్టల్ కు వెళ్లారు. సమాచారం అందుకున్న జిల్లా ఎంజేపీ  గురుకులాల కన్వీనర్ సుస్మిత స్కూలుకు చేరుకొని ఆరా తీశారు. ఉమ్మడి జిల్లా ఆర్సిఓ అంజలికి సమాచారం అందించారు.

ప్రిన్సిపాల్ సస్పెన్షన్​ 

లక్ష్మీపూర్ మహాత్మా జ్యోతి బాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మమత పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు గురుకుల స్టేట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సైదులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్సీఓ అంజలి తెలిపారు. రెండు రోజుల క్రితం లీవ్ లో ఉన్నప్పటికీ స్కూల్ కు హాజరైన సందర్భంలో మమత వ్యక్తిగత విషయానికి సంబంధించి గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. స్కూల్లో ఈ గొడవకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు తాను జిల్లా కోఆర్డినేటర్ సుష్మిత తో కలిసి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందించామని తెలిపారు. ఈ మేరకు స్టేట్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మమతను సస్పెండ్ చేసినట్లు ఆర్సీఓ వివరించారు.