కోస్గి, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండలంలోని చెన్నారం ప్రైమరీ స్కూల్ ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం ఆందోళన చేశారు. స్కూల్లో 40 మంది విద్యార్థులు ఉండగా, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో పలుమార్లు పేరెంట్స్ స్కూల్కు వెళ్లి సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్న భోజనం పెట్టకపోవడంతో పేరెంట్స్ బుధవారం స్కూల్ ముందు రోడ్డుపై ఆందోళనకు దిగారు.
హెచ్ఎం, వంట నిర్వాహకులను మార్చాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈవో శంకర్ నాయక్ సముదాయించే ప్రయత్నం చేయగా, పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని ఎంఈవోను నిలదీశారు. అనంతరం హెచ్ఎం, వంట నిర్వాహకులను మార్చాలని పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.