
వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మాంబాపూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు టైమ్ కు రావడం లేదని విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేశారు. దాదాపు 2 గంటల పాటు హైదరాబాద్–తాండూర్ రహదారిపై బైఠాయించి విద్యార్థులు నిరసన తెలిపారు. ఇదే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. అయితే బస్సు అద్దాలను ఆందోళన చేస్తున్న విద్యార్థులే పగలగొట్టారని కండక్టర్ ఆరోపించాడు. దీంతో బస్సు డ్రైవర్ కు విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. ఇదే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీసీ బస్సులు సమయానికి రావడం లేదని విద్యార్థులు ఆరోపించారు. బస్సులు అలస్యంగా వస్తున్నాయని డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేస్తే..ఆయన తమతో దురుసుగా మాట్లారంటూ విద్యార్థులు ఆరోపించారు. సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత బస్సులు సమయానికి రాకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపారు. దీంతో విద్యార్థులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పోలీసులు పంపించారు.