- బాత్రూమ్స్లో వీడియోలు తీశారని ఆరోపణ
మేడ్చల్, వెలుగు: మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఎదుట స్టూడెంట్లు బుధవారం రాత్రి ఆందోళన చేశారు. హాస్టల్‌లోని బాత్రూమ్స్ లో ఉండగా, వీడియోలు తీశారని ఆరోపించారు. హాస్టల్‌లో వంట చేసే సిబ్బందే వీడియోలు తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు చేరుకున్నారు. వారిని సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే ధర్నా చేపట్టారు. సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిర్వాహకులతో మాట్లాడారు. హాస్టల్‌లో పని చేసే సిబ్బంది ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వారి వద్ద నుంచి 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్ సిబ్బంది బాత్రూమ్స్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని, ఈ విషయం వార్డెన్‌కు చెప్పామని, కానీ ఆమె తమపైనే అసభ్యంగా మాట్లాడారని బాధిత స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.