- పీడీఎస్ యూ స్ఫూర్తి సభలో వక్తలు
హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో శుక్రవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పీడీఎస్ యూ) 50 ఏళ్ల పోరాట స్ఫూర్తి సభ జరిగింది. అంతకుముందు విద్యార్థులు హనుమకొండ ఏకశిలా పార్కు నుంచి సుబేదారి ఆర్ట్స్‌కాలేజీ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, ప్రొఫెసర్ కె. లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలు, వివక్షతకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడాలని పిలుపుఇచ్చారు. ఉస్మానియా వర్సిటీ వేదికగా జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర ప్రసాద్ నాయకత్వంలో పీడీఎస్ యూ ఉద్యమం పురుడు పోసుకుని దేశమంతటా వ్యాప్తి చెందిందని గుర్తుచేశారు.
కుల వివక్ష, అంటరానితనం, మహిళలపై అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా పీడీఎస్ యూ నిలబడిందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పీడీఎస్ యూ పాత్ర మరువలేనిదని ప్రొఫెసర్ సీహెచ్దినేశ్కుమార్ తెలిపారు. పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిళి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించగా.. పీడీఎస్ యూ జాతీయ కన్వీనర్ ఎం. రామకృష్ణ, ఇప్టూ జాతీయ అధ్యక్షుడు ఆరెళ్లి కృష్ణ, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సున్న అప్పారావు, పీడీఎస్ యూ నేతలు పాల్గొన్నారు.