స్టూడెంట్లు ఆత్మవిశ్వాసంతో ఎదగాలి
కామారెడ్డి, వెలుగు: స్టూడెంట్లు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ఆధ్వర్యంలో పదోతరగతిలో ‘10 జీపీఏ’ సాధించిన స్టూడెంట్లకు శనివారం జిల్లా కేంద్రంలో నగదు ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. పారితోషికం పొందిన స్టూడెంట్లు ఆ పైసలను వృథా చేయకుండా జీవితంలో ఉపయోగపడే మంచి బుక్స్కొనుగోలు చేసి చదవాలన్నారు. మనిషి జీవితంలో స్టూడెంట్దశ ఎంతో కీలకమైనదని, క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అలవర్చుకుంటే ఎంతో ఎత్తుకు ఎదగొచ్చన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్స్టూడెంట్లకు నగదు పురస్కారాలు అందజేయడం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, రిటైర్డ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు, జనరల్ సెక్రటరీ గంగాధర్‌గౌడ్, ట్రెజరర్ మల్లేశం, ప్రతినిధులు ఉపేందర్, శ్యాంరావు, నారాయణరెడ్డి, నీల లింగం తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో దసర పండుగ అనంతరం..సద్దుల బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శనివారం మండల కేంద్రంలో ‘సద్దుల బతుకమ్మ’ ఘనంగా నిర్వహించారు. మండలంలోని మహిళలందరితో పాటు బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఫాతిమా బేగం, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
ఆలయ అభివృద్ధికి రూ. 25 వేల విరాళం
పిట్లం, వెలుగు: జగదాంబ తండా వీరాంజనేయ ఆలయ అభివృద్ధికి బాన్సువాడకు చెందిన సురేశ్‌గుప్తా రూ. 25 వేల విరాళం అందించారు. శనివారం ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు తేజ గురుస్వామికి రూ. 25 వేల నగదును అందించారు. ఈ సందర్భంగా తేజస్వామి మాట్లాడుతూ ఆలయంలో గ్రానైట్ కోసం కోరగానే విరాళం అందించిన సురేశ్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సురేశ్భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
గీత కార్మికుడు పాపన్న.. గోల్కొండనేలిండు
ఎమ్మెల్సీ వీజీగౌడ్
ధర్పల్లి, వెలుగు: మొగల్ పాలకుల ఆగడాలపై తిరగబడిన గీత కార్మికుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ రాజుగా వెలుగొందాడని ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీటీసీ మెంబర్ బాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీజీ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో పేదలను పీడిస్తున్న మొగల్పాలకుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి పేద ప్రజలకు అండగా నిలిచిన పాపన్నను దక్కన్ ప్రజలు ఎంతో కీర్తిస్తారని చెప్పారు. గీత కార్మికుల సమస్యలను పరిష్కరిం చాలని ప్రభుత్వానికి నివేదించామని, వారికి అన్ని సౌకర్యాల కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వీజీ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సారిక హన్మంత్‌రెడ్డి, ధర్పల్లి సర్పంచ్ఆర్మూర్ పెద్ద బాలరాజు, విండో ప్రెసిడెంట్ చిన్నారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్, రాజ్‌పాల్‌రెడ్డి, గౌడ సంఘం నాయకులు సురేందర్‌గౌడ్, నిమ్మల పెద్ద గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. ‘మీసేవ’ ప్రారంభం ధర్పల్లిలో మున్నా మీసేవ సెంటర్‌ను ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీటీసీ మెంబర్జగన్ శనివారం ప్రారంభించారు. ఆన్లైన్సేవలను మరింత విస్తృతం చేయడానికి ఎంతో ఉపయోగ పడుతుందని వారు ఈ సందర్భంగా అన్నారు. అజ్మత్ పాల్గొన్నారు.
ప్రతిభ చూపిన స్టూడెంట్లకు సన్మానం
కామారెడ్డి, వెలుగు: ఎస్ఎస్ సీ, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్టూడెంట్లను కామారెడ్డి జిల్లా ‘ఆవోపా’ ఆధ్వర్యంలో శనివారం సన్మానించారు. జిల్లా కేంద్రంలో కొమ్మ జ్ఞానేశ్వర్సౌజన్యంతో వారికి సిల్వర్ మెడల్స్అందజేశారు. ఈ సందర్భంగా ‘ఆవోపా’ ప్రెసిడెంట్ ఉప్పలపు సంతోష్‌కుమార్, జనరల్ సెక్రటరీ తృప్తి శ్రీనివాస్‌గుప్తా, సెక్రటరీ గంగా ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతిభా పురస్కారాలు అందుకున్న స్టూడెంట్లు భావి తరాలకు మార్గదర్శకులుగా ఎదగాలన్నారు. వారి ఉన్నత చదువులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ స్టూడెంట్లను ప్రోత్సహిస్తే వారు మరింత రాణించే అవకాశం ఉందన్నారు. ప్రతినిధులు బాలయ్య, రమేశ్, మురళీ, మహేశ్, సంతోష్, ప్రసాద్, రమేశ్, శరత్, పవన్, సుధాకర్, సుబ్బారావు పాల్గొన్నారు.
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి'
బీర్కూర్, వెలుగు: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల వీఆర్ఏలు శనివారం మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 76 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
దుర్గామాత మండపం వద్ద అన్నదానం
భిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో దుర్గామాత మండపం వద్ద శనివారం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
కామారెడ్డిలో షర్మిలకు ఘన స్వాగతం
మొదటి రోజు పాదయాత్ర సక్సెస్
కామారెడ్డి , వెలుగు: వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల శనివారం నుంచి ఐదు రోజుల పాటు కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. మొదటి రోజు జిల్లా కేంద్రంలో పాదయాత్ర సాగింది. సిరిసిల్ల రోడ్డులో రామేశ్వర్‌పల్లి చౌరస్తా వద్ద షర్మిలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పాదయాత్ర సిరిసిల్లా రోడ్డు, స్టేషన్ రోడ్డు, రైల్వే బ్రిడ్జి, నిజాంసాగర్ చౌరస్తా, నిజాంసాగర్రోడ్డు, దేవునిపల్లి, లింగాపూర్స్టేజీ వరకు సాగింది. జిల్లా హాస్పిటల్ దగ్గరలో వైఎస్సాఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. అనంతరం ఇందిరా చౌక్‌లో జరిగిన మీటింగ్‌లో షర్మిల మాట్లాడారు. రాష్ర్ట ప్రభుత్వం, సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టౌన్లో భారీ సంఖ్యలో జనం యాత్రలో పాల్గొన్నారు. వైఎస్సార్టీపీ కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జి నీలం రలమేశ్, జిల్లా అధ్యక్షుడు సుధాకర్, లీడర్లు తాహేర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శివాజీ విగ్రహ స్థాపనకు మద్దతివ్వండి
బోధన్, వెలుగు : బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని బీజేపీ సీనియర్ నాయకుడు అడ్లూరి శ్రీనివాస్ శనివారం బోధన్ పట్టణ వాల్మీకి సంఘం ప్రధాన కార్యదర్శి ధర్మేంద్రను కలిసి కోరారు. ధర్మేంద్ర సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తామని హామీ ఇచ్చారన్నారు.
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
డిచ్పల్లి, వెలుగు: డిచ్పల్లి 7వ బెటాలియన్‌లోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. కమాండెంట్ సత్య శ్రీనివాస్, పర్వతవర్ధిని దంపతుల ఆధ్వర్యంలోఉదయం నిత్య హోమం, బలిహరణం అనంతరం అలివేలు మంగా సమేత వేంకటేశ్వరుడి కల్యాణం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం నిత్యాహవనము లాంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్లు వేంకటేశ్వర్లు, ఆంజనేయరెడ్డి, భాస్కర్ రావు, ఏవో హంసరాణి, ఆర్ఐ లు రాజు, వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం మత్తులో కెనాల్లో పడి వ్యక్తి మృతి
నందిపేట, వెలుగు: మండలంలోని డొంకేశ్వర్-– నూత్పల్లి రోడ్డు పక్కన మద్యం మత్తులో కెనాల్లో పడి జీజీ నడ్కుడ గ్రామానికి చెందిన కారగిరి భూమన్న(40) చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ధర్మాబాద్‌కు చెందిన భూమన్న బతుకుదెరువు కోసం పదేళ్ల కింద కుటుంబంతో కలిసి జీజీ నడ్కుడ గ్రామానికి వచ్చారు. గ్రామానికి చెందిన మీరోల్ల సాయన్న వద్ద వ్యవసాయ పనులు చేసేందుకు జీతానికి కుదిరాడు. ఈ నెల 6న పనులకు వచ్చిన భూమన్న అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ విషయమై భార్య లక్ష్మి యజమానిని ప్రశ్నిస్తే అదే రోజు మధ్యాహ్నం వెళ్లిపోయినట్లు తెలిపాడు. శనివారం సాయంత్రం డొంకేశ్వర్ శివారులోని నూత్పెళ్లి వెళ్లే రోడ్డులో కెనాల్ నీటిలో తల మునిగిపోయి డెడ్‌బాడీ బయటపడింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు భూమన్న డెడ్‌బాడీగా గుర్తించారు. తాగిన మత్తులోనే నీటిలో పడిపోయి ఉంటాడని భార్య లక్ష్మి పోలీసులకు కంప్లైంట్చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
జన్నారం,వెలుగు: అడవులతోనే మానవుని మనుగడ ఆధారపడి ఉందని, అడవుల సంరక్షణకు అందరు బాధ్యత తీసుకోవాలని ఎఫ్‌డీవో మాధవరావు అన్నారు. కవ్వాల్ టైగర్ జోన్ లో వారం రోజులుగా జరుగుతున్న వన్యప్రాణి వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. మండల కేంద్రంలోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ నుంచి గోండుగూడ గెట్ నెం1 వరకు ఫారెస్ట్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, స్టూడెంట్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు.అడవులుంటేనే వర్షాలు పడతాయని, వన్యప్రాణులు మానుగడ సాగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, తాళ్లపేట, ఇందన్ పెల్లి రేంజ్ ఆఫీసర్లు రత్నకర్,హఫీజోద్దిన్,జన్నారం సర్పంచ్ గంగాధర్,కో అప్షన్ సభ్యుడు మున్వర్ ఆలీఖాన్,కాంగ్రెస్ జిల్లా సెక్రెటరి మోహన్ రెడ్డి,డివిజన్ లోని ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
పింఛన్ పైసల్లో రూ.216 కోత
డాక్ మెయిల్ క్యారియర్ చేతివాటం
పోస్టల్ అధికారులకు ఫిర్యాదు
లింగంపేట, వెలుగు: వృద్ధుల పింఛన్డబ్బుల పంపిణీలో నల్లమడుగు గ్రామీణ డాక్ సేవక్ మెయిల్ క్యారియర్(జీడీఎస్ఎంసీ) యూసుఫ్చేతివాటం ప్రదర్శించాడని వృద్ధులు పోసుగారి కిష్టయ్య, టీక్యానాయక్ శనివారం స్థానిక మీడియా ఎదుట వాపోయారు. నల్లమడుగు, దగ్గరలోని తండాలకు చెందిన39 మందికి ఇటీవల ప్రభుత్వం ఆసరా పింఛన్లను శాంక్షన్చేసింది. కాగా శనివారం లింగంపేట పోస్టాఫీస్‌లో పింఛన్డబ్బులను పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ.2,016 ఇవ్వాల్సి ఉండగా జీడీఎస్ఎంసీ యూసుఫ్రూ.1800లను చేతికి ఇచ్చాడని చెప్పారు. ఒక్కొక్కరికి రూ.216 లు తక్కువగా ఇస్తున్నాడని తెలుసుకున్న నల్లమడుగు గ్రామానికి చెందిన యువకులు బాధితులతో కలిసి డాక్సేవక్ ఎస్పీఎం మురళికి కంప్లైంట్చేశారు. యూసుఫ్ గతంలో కూడా ఉపాధి హామీ పథకం నిధులు చెల్లింపులలో చేతివాటం ప్రదర్శించాడని ఆరోపించారు. కాగా పింఛన్ డబ్బులలో చేతివాటంపై యూసుఫ్‌ను ప్రశ్నించగా లబ్ధిదారులే తనకు గుడ్‌విల్‌గా డబ్బులు ఇచ్చారని చెప్పారు. కొందరు వృద్ధులు ఆందోళనకు దిగితే వారి పైసలు తిరిగి ఇచ్చానని చెప్పాడు.'
రూ.216 లు తక్కువ ఇచ్చిండు
నాకు కొత్తగా ఆసరా ఫించన్ శాంక్షన్అయ్యింది. పైసలు తీసుకునేందుకు వెళ్లగా రూ.1800లు చేతిలో పెట్టి పొమ్మన్నాడు. రూ.216 ఎందుకు తక్కువ ఇస్తున్నావని అడిగితే కొత్త పింఛన్బుక్కు కోసం తీసుకుంటున్నానని చెప్పాడు. యూసుఫ్ఉపాధి కూలీల డబ్బుల పంపిణీలో కూడా నొక్కేశాడు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
-
పోసుగారి కిష్టయ్య, నల్లమడుగు'
లొల్లి పెడితే ఇచ్చిండు
నాకు పింఛన్‌డబ్బులు ముందుగా రూ.1800 ఇచ్చాడు. రూ.216 ఎందుకు తక్కువ ఇస్తున్నవని గట్టిగా లొల్లిపెట్టిన. చుట్టుపక్కల వారు జమయ్యారు. మిగతా రూ.216 తిరిగి ఇచ్చాడు. వృద్ధుల పించన్ డబ్బులను తక్కువగా ఇస్తూ పేదోళ్లను మోసం చేస్తున్న వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించాలి.
-
టీక్యా నాయక్, నల్లమడుగు తండా
విధుల నుంచి తొలగించాం
మెయిల్ క్యారియర్ యూసుఫ్ చేతివాటంపై కంప్లైంట్రాగానే విధుల నుంచి తొలగించాం. అతడి నుంచి పింఛన్ డబ్బులను కూడా వాపస్ తీసుకున్నాం. సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. - మురళీ, ఎస్పీఎం