గూడూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లను నియమించాలని గురువారం స్టూడెంట్లు ధర్నా చేశారు. గ్రామానికి చెందిన చెందిన ఓ వ్యక్తి పాఠశాలను దత్తత తీసుకుని 14మంది ప్రైవేట్ టీచర్లను నియమించాడు. అయితే రెండు సంవత్సరాలుగా పాఠశాలలో స్టూడెంట్ల నుంచి డొనేషన్ పేరుతో పైసలు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ మీటింగ్లో ఎస్ఎంసీ చైర్మన్ లెక్కలు చెప్పాలని నిలదీశారు. అతడు మొఖం చాటేయడంతో పాటు ప్రైవేట్ టీచర్లను 15రోజుల నుంచి పాఠశాలకు రాకుండా దత్తత తీసుకున్న వ్యక్తి బంద్ చేయించాడు.
అప్పటి నుంచి పాఠాలు బోధించే వారు లేక ఈ విషయాన్ని విద్యాశాఖ ఆఫీసర్లకు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాకపోవడంతో స్టూడెంట్లంతా కలసి గూడూరు చివర నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ తీసి హైవేపై ధర్నా చేశారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు ఆపేది లేదని గంటకు పైగా రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈవో శ్రీదేవి స్టూడెంట్లతో మాట్లాడి టీచర్లను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.