ఆమనగల్లు, వెలుగు: మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఆమనగల్లుకు వచ్చే విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడపాలంటూ బుధవారం షాద్ నగర్ రోడ్డుపై విద్యార్థులు, ఏబీవీపీ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రావిచేడు, మక్త మాదారం, న్యామతాపూర్, చెల్లంపల్లి, పడకల్, సాలార్పూర్ గ్రామాల నుంచి రోజు 150 మంది విద్యార్థులు ఒకే బస్సులో ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఈ ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన స్పందించడం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా షాద్‌నగర్ డిపో అధికారులు అదనపు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, ఉమేశ్, సందీప్, పవన్, శివ, అనిల్, దినేశ్ విద్యార్థులు పాల్గొన్నారు.
ఆరోగ్య కేంద్రాలలో పరిశుభ్రత పాటించాలి
నర్వ, వెలుగు: తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, 5వ తరగతి లోపు విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలని నారాయణపేట్ కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం నర్వ మండలంలో పర్యటించి స్కూళ్లను, అంగన్వాడీ కేంద్రం, పీహెచ్‌సీలను పరిశీలించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో మన ఊరు –మన బడి పనులను వారం రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, తహసీల్దార్ దయాకర్ రెడ్డి, ఎంపీడీఓ రమేశ్ పాల్గొన్నారు.
చివరి ఆయకట్టుకూ నీరు అందించాలి
గద్వాల, వెలుగు: గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం రిజర్వాయర్ ఎడమ కాలువను పరిశీలించారు. ఎడమ కాలువ పూడికతీత తీయకపోవడం వల్ల నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుందని దీంతో నిలహళ్లి, నెట్టెంపాడు, నాగర్ దొడ్డి, ధ్యాగా దొడ్డి గ్రామాల్లోని పంట పొలాలకు నీరు రావడం లేదన్నారు. వెంటనే కాలువల పూడికతీసి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు, గోవిందు, మునేప్ప తదితరులు పాల్గొన్నారు.
పండ్లు, కూరగాయల మొక్కల అంటుకట్టు విధానంపై శిక్షణ
పెద్దమందడి, వెలుగు : మండలంలోని మోజర్ల కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం లో విద్యార్థులకు పండ్లు కూరగాయలకు అంటుకట్టు విధానంపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నిధులతో నిర్వహిస్తున్న నర్సరీ ఏర్పాటు, నాణ్యమైన మొక్కల ఉత్పత్తికి సర్టిఫికేషన్ శిక్షణ కార్యక్రమం మోజర్లలోని ఉద్యాన కళాశాలలో విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు, విద్యార్థుల కు అంటు మొక్కల తయారీలో నిష్ణాతులయితే రైతులకు లాభసాటి పంటలు రెట్టింపు దిగుబడి వస్తుందని తెలిపారు, అంటుకట్టిన కూరగాయ మొక్కలు సాగు చేస్తే రెట్టింపు దిగుబడులు పొందవచ్చని కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పిడిగం సైదయ్య అన్నారు. సమస్యాత్మక భూముల్లో సైతం అంటు మొక్కలు మేలైన దిగబడి ఇస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది డాక్టర్ కె.కళాధర్ బాబు, కత్తుల నాగరాజు, డాక్టర్ మురళి, డాక్టర్ సహనాజ్ పాల్గొన్నారు.
మన ఊరు - మన బడి పనులు వెంటనే పూర్తి చేయాలి
వనపర్తి, వెలుగు: మన ఊరు- –మన బడి పనులను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇంకా గ్రౌండింగ్ కాని పనులను తక్షణమే గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పి సీఈవో వెంకట్ రెడ్డి, డీఈఓ రవీందర్, పీఆర్ ఈ.ఈ. మల్లయ్య, సీపీఓ వెంకటరమణ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి పనులు పూర్తి చేయాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలోని 4 మున్సిపాలిటీల పట్టణ అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన సమీకృత కూరగాయల మార్కెట్, వైకుంఠ ధామం, నర్సరీల ఏర్పాటు, పట్టణ ప్రకృతి వనాలు, కొత్త భవనాలకు టాక్స్ లెక్కించి కేటాయింపుపై వివరాలను తెలుసుకున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు ధనుర్వాతం, కోరింత దగ్గు వ్యాక్సినేషన్ వేయాలని ఆదేశించారు. ధనుర్వాతం, కోరింత దగ్గును నిర్మూలించడానికి ఈ నెల 7 నుంచి 18 వరకు పిల్లలకు వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధాకర్ లాల్, ప్రోగ్రాం ఆఫీసర్ రవికుమార్, మున్సిపల్ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి పాల్గొన్నారు.
నవోదయ నర్సింగ్ కాలేజ్ ఎదుట స్టూడెంట్ల ఆందోళన
మహబూబ్‌నగర్, వెలుగు : కోర్సు కంప్లీట్ చేసినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, సర్టిఫికెట్లు కావాలంటే అదనంగా రూ.25 వేలు డిమాండ్ చేస్తున్నారని జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో ఉన్న నవోదయ నర్సింగ్ కాలేజ్ ఎదుట మంగళవారం మధ్యాహ్నం స్టూడెంట్లు పెట్రోల్ బాటిల్‌తో ఆందోళనకు దిగారు. పవన్ 2017లో , విజయ్ 2022లో నవోదయ కాలేజ్‌లో నర్సింగ్ పూర్తి చేశారు. ఇద్దరూ రూ.35 వేల చొప్పున ఫీజ్ కూడా క్లియర్ చేశారు. కోర్సు కంప్లీట్ చేసినా.. వీరికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి యాజమాన్యం సతాయిస్తోందని బాధిత స్టూడెంట్లు తెలిపారు. దీంతో సూసైడ్ చేసుకోవడానికి పెట్రోల్ బాటిల్లో కాలేజ్‌కు వచ్చినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్టూడెంట్ యూనియన్ లీడర్లు ఆందోళనకు దిగారు. గంట పాటు నిరసన వ్యక్తం చేస్తున్నా, యాజమాన్యం స్పందించలేదు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు కాలేజ్ వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని, విచారిస్తున్నట్టు రూరల్ ఎస్ఐ రమేశ్ తెలిపారు.
కార్మికులు చనిపోతే రూ. 10 లక్షలు ఇవ్వాలి
అలంపూర్,వెలుగు: కార్మికులు చనిపోతే రూ. 10 లక్షలు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఉండవల్లి మండల కేంద్రంలో ఈనెల 8, 9 న జరిగే చలో మహబూబాబాద్ 3వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ సభలను భవన కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులు 5 సంవత్సరాలకు కాకుండా శాశ్వత కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు .55 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి రూ. 10 లక్షలు రూపాయలు పెన్షన్ సౌకర్యం, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్, ప్రమాద, ఆరోగ్య బీమా లు కల్పించాలని కోరాఉ. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు అధ్యక్షుడు ఖదీర్ భాష, కృష్ణ, మధు, బాలు, మద్దిలేటి, షేక్షావలి, మద్దిలేటి బాలస్వామి శంకర్, మహేశ్, గోపాల్ పాల్గొన్నారు.
గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆలస్యం చేయొద్దు
మహబూబ్‌నగర్, వెలుగు : గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆలస్యం చేయొద్దని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్‌రెడ్డి ఆఫీసర్లకు సూచించారు. పింఛన్లు, ఉపాధి హామీ, పల్లె ప్రగతి, క్రీడా ప్రాంగణాలు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు నేరుగా గ్రామీణ లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, వాటి అమలులో జాప్యం లేకుండా చూడాలని చెప్పారు. జిల్లా పరిషత్‌లో జడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో 2వ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడారు. మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ ద్వారా పనులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వడ్ల కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో మొగులప్ప, సివిల్ సప్లయ్ మేనేజర్ జగదీశ్ పాల్గొన్నారు. జడ్పీ సీఈవో ఛాంబర్లో వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య అధ్యక్షతన జిల్లా పరిషత్ 3వ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగిలో పశుగ్రాసం సబ్సిడీ విత్తనాలను రైతులకు అవసరం మేరకు ఇవ్వాలని చెప్పారు. ఇచ్చిన విత్తనాలు విత్తినది, లేనిది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆఫీసర్లకు ఆదేశించారు.