
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : స్టూడెంట్లకు సరిపడా బస్సులు నడపాలని గుమ్మడిదలలో జాతీయ రహదారిపై ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ విద్యార్థి నాయకులు సోమవారం బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో విద్యార్థులకు బస్సులు సరిపోక కాలేజీలకు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు జీడిమెట్ల, నర్సాపూర్ డిపో అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
వారు పట్టించుకోకపోవడంతోనే ధర్నాకు దిగినట్లు తెలిపారు. ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకున్న మెదక్ డిపో అధికారి సుధ గుమ్మడిదలకు చేరుకుని విద్యార్థులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ నాయకులు మోహన్ సాయి, రోహిత్ రెడ్డి, బాల్ రెడ్డి, సందీప్, బాలరాజు యాదవ్, ఉపేందర్ రెడ్డి, ఏబీవీపీ నాయకులు ఉదయ్ సాగర్, విజయ్, సాయిరాం, మణికంఠ, స్టూడెంట్స్ పాల్గొన్నారు.