అంపశయ్యపై మన చదువులు

అనాదిగా మనదేశం జ్ఞానాన్వేషణకు పెట్టింది పేరు. గొప్ప జ్ఞానంతో కూడిన నాగరికతను తీర్చిదిద్దిన మహనీయులైన గురువులు అనేక మందికి ఇది కర్మభూమి. ప్రపంచస్థాయి బోధనా ప్రమాణాలకు నెలవైన మనం గడిచిన అర్ధశతాబ్దంగా మరీ ముఖ్యంగా గత రెండు దశాబ్దాల కాలంలో అత్యంత వేగంగా తిరోగమన బాట పట్టాం. జ్ఞానమన్నది సదా వికసిస్తూనే ఉంటుంది. దానికి తగినట్టుగా గురువులు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. కానీ మనదేశంలో స్కూళ్లు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలో నాణ్యతా ప్రమాణాలు ఏటికేడు దిగజారిపోతున్నాయి. స్పష్టంగా కనిపిస్తున్న ఈ క్షీణితకు ముఖ్యంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్పకూలడం
బడి స్థాయిలో ప్రాథమిక, ఉన్నత విద్య అనేది కొన్ని దశాబ్దాల క్రితం వరకు వ్యాపారం కాదు. పిల్లలకు కనీసం 10వ తరగతి వరకైనా నాణ్యమైన చదువు అందించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండేది. రాజ్యాంగపరంగా ఉన్న నైతిక బాధ్యత కారణంగా అన్ని సామాజిక- ఆర్థిక తరగతులు సహ దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి కూడా బడి చదువును రాష్ట్ర ప్రభుత్వాలు సులభంగా అందుబాటులో ఉంచేవి. కానీ, ప్రభుత్వ స్కూళ్లను ‘లాభదాయక కేంద్రాలు’గా కాకుండా ‘ఖర్చు కేంద్రాలు’గా భావించడం, నిరంతర పెట్టుబడి, పాలనా వ్యవహారాలు ముడిపడి ఉండటంతో ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధిని దాదాపు అన్ని రాష్ట్రాలూ పక్కనపడేశాయి. ఆదాయాన్ని అందించే మూలధన వ్యయం లేదా ఓట్లు కురిపించే నగదు బదిలీ పథకాలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు విద్యార్థులు చేరడం లేదని ఏకంగా 4,500లకు పైగా స్కూళ్లకు నిర్లజ్జగా తాళం వేశాయి. కానీ, వాస్తవమేంటంటే ప్రభుత్వ అసమర్థత, మారుతున్న ప్రాధాన్యతలే. దేశ తొలి రాష్ట్రపతి నుంచి ప్రజల ప్రెసిడెంట్​గా పేరుగాంచిన డాక్టర్ అబ్దుల్ కలాం వరకు, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో దిగ్గజాలుగా ఉన్న అనేక మంది ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారే. కానీ క్షీణిస్తున్న సామాజిక విలువలు, అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో విధేయత లోపించిన కారణంగా గడిచిన కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ స్కూళ్లలో బోధనా ప్రమాణాలు దిగజారాయి. మంచి జీతాలు లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత, పాలనాపరమైన స్వేచ్ఛ లోపించడం, కెరీర్ ఎదుగుదలకు అవకాశాలు లేకపోవడం వలన ప్రభుత్వ బడుల్లో బోధనా నైపుణ్యం గండిపడుతూ వస్తోంది.

విద్యార్థుల బుజ్జగింపు, క్రమశిక్షణా రాహిత్యం
ప్రైవేట్ స్కూళ్లకు స్టూడెంట్లంటే కస్టమర్లు. వారిని ఆదాయ వనరులుగా అవి భావిస్తుంటాయి. కానీ, ఈ కొత్త గుర్తింపు బాల్యంలోనే విద్యార్థులను క్రమశిక్షణా రాహిత్యం వైపు మళ్లిస్తోంది. బడులకు వెళ్లే పిల్లల్లో క్రమశిక్షణ అన్నది ఇప్పుడు మచ్చుకైనా కనపడటం లేదు. అనేక స్కూళ్లలో ప్రవర్తనా నియంత్రణ అన్నది ఎండ మావే. అంతే కాదు చాలా ప్రైవేట్ స్కూళ్లు కౌమార మస్తిష్కాలను వారికి నచ్చినట్టుగా ఉండాలని బోధిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి. ఈ కొత్త తరహా బోధనలో అన్ని రకాల క్రమశిక్షణారాహిత్యానికి చోటు లభిస్తోంది. కొన్ని బడులు అయితే ఒక అడుగు ముందుకేసి కస్టమర్ల సంపూర్ణ సంతృప్తి అన్నట్టు టీచర్ల ప్రవర్తన, తీరుపై విద్యార్థుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాయి. టీచర్ల ప్రవర్తనను స్టూడెంట్లు బేరీజు వేసే స్థితిలో ఉన్నప్పుడు ఆ టీచర్లు కాస్ రూమ్స్​లో క్రమశిక్షణను ఎలా అమలు చేయగలరు? ఏ ప్రవర్తన అయినా నేర్చుకుంటేనే వస్తుంది. పిల్లలు ఎదుగుతున్న దశలో స్కూల్​లోనూ, ఇంట్లోనూ కఠినమైన క్రమశిక్షణ, ప్రవర్తనా నియంత్రణ ఉండాలి. పసితనంలోనే క్రమశిక్షణా రాహిత్యం చొరబడితే అది తీవ్రమైన అవిధేయత, సూచనలను అలక్ష్యం చేయడం, భావోద్వేగ మేధస్సు లోపించడం సహా జీవితంలోని తర్వాతి దశల్లో నేరపూరిత ప్రవర్తనకు దారి తీస్తుంది. బడులనేవి స్టూడెంట్లను ఉపాధి కోసం సిద్ధం చేయడం కాదు.. వారిని జీవితాల కోసం సిద్ధం చేయాలి. మనదేశంలో పాత కాలం నాటి ప్రభుత్వ బడుల్లో చదువుతోపాటు క్రమశిక్షణ, పరస్పర గౌరవం, పౌరుల కర్తవ్యాలు, జాతీయత, దేశభక్తి బోధించేవారు. కానీ, విద్యార్థులు- తల్లిదండ్రులను ఆకట్టుకోవడమే ధేయ్యంగా పనిచేసే అనేక ప్రైవేట్ బడులు సంస్థాగత బాధ్యతకు తిలోదకాలిచ్చి సిలబస్ బోధనతో సరిపెట్టి చేతులు దులిపేసుకుంటున్నాయి. అనేక ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లను విద్యార్థులు గౌరవించకపోవడమే కాదు పాఠాలు వినేందుకూ ఆసక్తి చూపడం లేదు. అంతే కాదు ఈ బాలలు తల్లిదండ్రులను కూడా ఏ మాత్రం గౌరవించరు. కుటుంబ, సామాజిక సంబంధాలను గుర్తించరు. విలువల ఆధారిత చదువులు అందించడంలో స్కూళ్ల అసమర్థత రేపైనా వాటిని వెంటాడక తప్పదు.

మనదేశంలో బోధనా విధానాన్ని పునఃపరిశీలించి మన నాగరితకకు సంబంధించిన పురాతన బోధనా ప్రమాణాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వీయ విలువను నాశనం చేసి యువ మనసులను వికృతం చేసే విదేశీ పోకడలు అనుసరించడాన్ని ప్రైవేట్ స్కూళ్లు మానుకోవాలి. జ్ఞానవ్యాప్తి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించవచ్చు. కానీ ఆధునిక బోధన పేరుతో ప్రధాన స్ఫూర్తి, కీలక విలువలను పక్కనపెడితే దాని వల్ల యువభారతం, దేశమూ తల్లడిల్లుతాయి. ప్రైవేట్ స్కూళ్లు దీన్ని చక్కదిద్దుకోకపోతే విజ్ఞానపరంగా, వృత్తిపరంగా భవిష్యత్ లో ఊహించని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బోధనా అసమర్థత
బోధనా విధానంలో అసమర్థత రోజురోజుకూ పెరుగుతోంది. మంచి టీచర్లు దొరకడం నేడు దుర్లభంగా మారింది. సంపూర్ణ విద్య అనే భావన గురించి అవగాహన లేని వ్యక్తుల నిర్వహణలో చాలా ప్రైవేట్ స్కూళ్లు నడుస్తున్నాయి. స్కూల్ అడ్మిషన్లను ఎంత ఎక్కువగా అమ్మగలుగుతారనే సామర్థ్యం పైనే ప్రిన్సిపల్స్, బోధనా సిబ్బంది ఎంపిక జరుగుతోంది. పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లోని బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం వంటివి ప్రైవేట్ బడులకు విస్తరించాయి. దురదృష్టవశాత్తు ఈ సంస్కృతి దేశమంతటా విస్తరించి ఉంది. పాత కాలం నాటి బోధనా సమర్థత కలిగిన చక్కని జ్ఞానం, శిక్షణ, సమర్థులైన టీచర్లకు అనేక ప్రైవేట్ స్కూళ్లలో స్థానం ఉండదు. సన్నిహితులు, మిడి మిడి జ్ఞానం కలిగినవారు టీచర్లు అవుతున్నారు. దీంతో జవాబుదారీతనం లేని పని సంస్కృతి విస్తరిస్తోంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఉండే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చాలా మంది టీచర్లు తమ అసమర్థతను, విషయ పరిజ్ఞానలేమిని కప్పిపుచ్చుకునేందుకు వినోదాన్ని చేర్చుతున్నారు. విద్యార్థుల నుంచి మంచి మార్కులు పొందేందుకు చాలా మంది టీచర్లు తమ రూపు, చూపులతో ‘కూల్ అండ్ యంగ్’గా కనిపించేందుకు తాపత్రయపడుతున్న పరిస్థితి. పాత కాలం బోధనలో టీచర్ల నుంచి మెప్పు పొందాలని పిల్లలు తహతహలాడేవారు. టీచర్లు బోధన మాత్రమే చేయాలి. వినోదం అందించేందుకు ఇతరులు ఉన్నారు. ఏ విషయంలోనూ నిజమైన నైపుణ్యం లేకపోయినా చాలా మంది టీచర్లు గూగుల్ కారణంగా బతికి బట్టకడుతున్నారు. అలాంటి వారిని గూగుల్ టీచర్లు అని పిలవాలని నాకనిపిస్తోంది. 

ప్రైవేట్ స్కూళ్లు.. వాణిజ్య ఆకాంక్షలు
ప్రభుత్వ బడుల్లో నిర్వహణా లోపాలను ప్రైవేట్ స్కూళ్లు తమకు అనుకూలంగా మల్చుకున్నాయి. ఇవి ఎంత బలంగా పాతుకుపోయాయంటే రెండు దశాబ్దాల కాలంలోనే ప్రభుత్వ బడుల సంఖ్యను ప్రైవేట్ స్కూళ్లు దాటిపోయాయి. ప్రపంచంలోనే అతి పెద్ద పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో పాఠశాల విద్యా వ్యవస్థ ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. అక్కడ ప్రైవేట్ స్కూళ్లు ఉన్నా ప్రభుత్వ బడులతో పోల్చితే వాటి సంఖ్య 10% కూడా ఉండదు. చదువులకు అమెరికా ఇస్తున్న ప్రాధాన్యత అది. ప్రైవేట్ స్కూళ్లకు వాణిజ్యపరమైన ఆశ ఉండటం సహజం. నాణ్యమైన విద్య, అందుబాటు ఫీజులు, జవాబుదారీతనం అన్నవి నోటి మాటలే. మొదట్లో కొన్ని బడులు సేవాభావం చూపినా పోటీ, ఇతరత్రా కారణాల వలన అవి కూడా వాణిజ్యపరంగా లబ్ధి పొందేందుకే మొగ్గు చూపుతాయి. పిల్లలు ఎదుగుతున్న దశలో దేశీయ బోధన ఉండాలనే ప్రాథమిక ఆలోచనను పట్టణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ వెక్కిరిస్తున్నాయి. పిల్లల సమగ్ర వికాసానికి అవసరమైన దేశ చరిత్ర, సనాతన సంప్రదాయం, నాగరికత పరిజ్ఞానం, పౌర విలువల వంటి అంశాలన్నీ మూలనపడిపోయాయి. అలా అని ప్రైవేట్ స్కూళ్లన్నీ జనాల్ని పీడిస్తున్నాయని చెప్పడం లేదు. నాణ్యమైన చదువు, సమగ్ర వికాసానికి పాటుపడే ప్రైవేట్ బడులు అరుదుగా కనిపిస్తున్నాయి.

- కె.కృష్ణసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి