- పగిలిన డోర్లు.. పగుళ్లిచ్చిన తరగతి గదులు
- ఒకటి, రెంటికి సులభ్ కాంప్లెక్స్లే దిక్కు
- తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
- పట్టించుకోని పాలకులు, అధికారులు
వేములవాడ, వెలుగు : స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో క్రీడాపోటీలు, పొలిటికల్ మీటింగ్స్, ఎన్నికల కౌంటింగ్లకు ఈ కాలేజీ మైదానాన్నే ఉపయోగిస్తుంటారు. మినిస్టర్ కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాగా, అభివృద్ధికి రోల్ మాడల్ గా చెప్పుకునే ఈ నియోజకవర్గంలోని కాలేజీలో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
1980లో కాలేజీ ప్రారంభం..
వేములవాడ జూనియర్ కాలేజీని 1980లో ప్రారంభించారు. వేల మంది విద్యార్థులును తీర్చిదిద్దిన ఈ కాలేజీ మైదానం సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 191మంది, సెకెండియర్లో 216 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో కాలేజీకి కొద్ది దూరంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్ కు వెళుతున్నారు.
శిథిలావస్థలో..
సుమారు 43 ఏళ్ల క్రితం నిర్మించిన కాలేజీ తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. గదుల లోపలి భాగం పగుళ్లిచ్చాయి. దీంతో అవి ఎప్పుడు కూలుతాయోనని విద్యార్థులు భయం గుప్పిట్లో చదువులు కొనసాగిస్తున్నారు. గదులకు ఉన్న కిటికీలు, తలుపులు పగిలిపోయాయి. చలికాలంలో, వానకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ ల్యాబ్ లు శిథిలావస్థకు చేరుకోగా ల్యాబ్ లో పరికరాలు పనికిరాకుండా మారాయి. ఇంతపెద్ద కాలేజీలో విద్యార్థులకు లైబ్రరీ గది కూడా లేదు.
నెరవేరని హామీలు..
మా కాలేజీకి వచ్చే లీడర్లంతా హామీలు ఇచ్చి వెళతారే తప్ప ఎవరూ సమస్యలు పరిష్కరించరు. మేం పేద వాళ్లం కాబట్టే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నాం. మాపై లక్షలు ఖర్చు చేస్తున్నాం అని చెబుతున్నారు. కాలేజీలో కనీస సౌకర్యాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నాం.
- వెన్నెల, ఇంటర్ సెంకడియర్, వేములవాడ
సౌకర్యాలు మెరుగుపర్చాలి
ప్రభుత్వం పేద విద్యార్థులను పట్టించుకోవాలి. నిధులు కేటాయించి మా కాలేజీలో మౌలిక వసతులు మెరుగుపర్చాలి. లైబ్రరీకి గది కేటాయించాలి.
-వాగ్దేవి, ఇంటర్ ఫస్టియర్, వేములవాడ