
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బడుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య, దానికి అనుగుణంగా టీచర్ల సంఖ్య పెరిగింది. సంఖ్యాపరంగా చూస్తే స్కూళ్లలో అమ్మాయిల అడ్మిషన్ల సంఖ్య కూడా ఎక్కువైంది. మూడేండ్లలో సర్కారు బడి ఒకటి తగ్గితే.. ప్రైవేటు స్కూళ్లు మాత్రం భారీగా పెరిగాయి. తాజాగా విద్యా శాఖ అసెంబ్లీకి ఇచ్చిన లెక్కల్లో ఈ విషయం తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41,354 స్కూళ్లు ఉండగా.. వాటిలో 62.12 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 25.13 లక్షల మంది సర్కారు విద్యా సంస్థల్లో చదువుతుండగా, 37.01 లక్షల మంది ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. అలాగే, మూడేండ్లలో టీచర్ల సంఖ్య కూడా పెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా సర్కారు, ప్రైవేటు అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో 2022– 23 విద్యా సంవత్సరంలో 2,81,938 మంది టీచర్లు ఉండగా.. 2023–24లో వారి సంఖ్య 3,16,571కు పెరిగింది. 2024– 25 విద్యా సంవత్సరంలో టీచర్ల సంఖ్య 3,33,269కి చేరింది. ఈ లెక్కన మూడేండ్లలో ఏకంగా 51 వేలకు పైగా కొత్త టీచర్లు వచ్చారు. కాగా, రెండేండ్లలో సర్కారు స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో కొత్తగా చాలా మంది టీచర్లను సర్కారు నియమించిన విషయం తెలిసిందే.
స్కూళ్లు కూడా పెరిగినయ్
ఏటా రాష్ట్రంలో స్టూడెంట్ల సంఖ్యతో పాటు స్కూళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2022–23లో 40,656 స్కూళ్లు, 2023–24లో 40,975 బడులు ఉండగా, 2024–25లో ఆ సంఖ్య 41,354కు చేరింది. మూడేండ్లలో ప్రైమరీ లెవెల్ లో కేవలం 17 స్కూళ్లు పెరగ్గా, హైస్కూళ్లు 265కు పెరిగాయి. మరోపక్క సర్కారు స్కూళ్లు 41 తగ్గగా.. ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఏకంగా 739 పెరిగాయి. మరోవైపు గత మూడేండ్లుగా అడ్మిషన్లలో అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నది.
2022–23 విద్యా సంవత్సరంలో 27,85,741 మంది బాలికలు స్కూళ్లలో చేరగా, 2024–25లో ఆ సంఖ్య 29,23,939 కి చేరింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ 2022–23 విద్యా సంవత్సరంలో 13,99,876 మంది అమ్మాయిలు ఉండగా, 2024–25 లో ఆ సంఖ్య 14,61,850 కి పెరిగింది. అయితే, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగానే ఉంది. గతంతో పోలిస్తే మాత్రం బాలికల సంఖ్య పెరిగింది. ఇప్పటికే డిగ్రీ అడ్మిషన్లలో సగానికి పైగా అమ్మాయిలుంటే, పీజీలో ఏకంగా 70 శాతానికి పైగా అమ్మాయిలే ఉన్నారు.