మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీ దగ్గరలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్అండ్ జూనియర్ కాలేజీ (బాయ్స్) ఖాళీ అయ్యింది. ఓవైపు డంపింగ్‌యార్డు పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరోవైపు రేకుల షెడ్లలో కనీస సౌలత్లు కూడా లేవు. ఇందులో చదువుకుంటున్న 640 మంది స్టూడెంట్లు ‘‘ఈ స్కూల్లో మేము ఉండలేం”అని ఈమధ్యనే ఇండ్లకు వెళ్లిపోయారు. ఇక్కడ పనిచేస్తున్న 25 మంది టీచర్లు రోజూ వచ్చి టైమ్‌పాస్ చేసి వెళ్తున్నారు. నాలుగు రోజుల నుంచి హైస్కూల్ స్టూడెంట్లకు ఆన్లైన్ క్లాస్‌లు చెప్తున్నారు. ఏకంగా స్కూల్ మూతపడ్డప్పటికీ లోకల్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు గానీ, సంబంధిత శాఖ ఆఫీసర్లు గానీ పట్టించుకోవడం లేదని పేరెంట్స్ కమిటీ ప్రతినిధులు మండిపడ్తున్నారు. స్కూల్‌ను మరో చోటికి మార్చేంత వరకు పిల్లలను పంపబోమని పేరెంట్స్అంటున్నారు.
ఏడేండ్లలో మూడుసార్లు మార్పు
2016లో మంచిర్యాల నియోజకవర్గానికి సోషల్వెల్ఫేర్ రెసిడెన్షియల్ శాంక్షన్ అయ్యింది. కాలేజీ రోడ్‌లోని ఓ ప్రైవేట్బిల్డింగ్లో 2018 వరకు నిర్వహించారు. అక్కడ సరైన సౌలతులు లేకపోవడంతో మంచిర్యాల పక్కనే ఉన్న గద్దెరాగడి మెయిన్ రోడ్డులోని మరో ప్రైవేట్ బిల్డింగ్‌లోకి షిఫ్ట్ చేశారు. నిరుటి వరకు అందులోనే నడిపించారు. జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్కావడంతో ఇంటర్ బోర్డు నుంచి అఫిలియేషన్ చిక్కు వచ్చిపడింది. మంచిర్యాల నియోజకవర్గానికి శాంక్షన్ అయిన కాలేజీని చెన్నూర్ నియోజకవర్గం పరిధిలోని గద్దెరాగడిలో నిర్వహించడంపై ఇంటర్ బోర్డు అభ్యంతరం తెలిపింది. ఆఫీసర్లకు సమస్య వివరించి ఎలాగోలా అఫిలియేషన్ తెచ్చుకున్నారు. కానీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మాత్రం తప్పనిసరిగా మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోనే నిర్వహించాలని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది జూన్‌లో మంచిర్యాలలోని అండాలమ్మ కాలనీకి మార్చారు.
పక్కనే డంపింగ్ యార్డు
అండాలమ్మ కాలనీ దగ్గరలోని బీఆర్ ఫంక్షన్హాల్లో ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీని ఏర్పాటు చేశారు. నెలకు దాదాపు రూ.2 లక్షల రెంట్ చెల్లిస్తున్నారు. పైఆఫీసర్ల సూచనల మేరకు ఫంక్షన్ హాల్ మేనేజ్మెంట్ స్కూల్నిర్వహణకు అనుగుణంగా మార్పులు చేశారు. ఇక్కడినుంచి కేవలం 300 మీటర్ల దూరంలో అండాలమ్మ కాలనీలో టెంపరరీ డంపింగ్ యార్డు ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను ఇక్కడే డంప్‌చేసి కాల్చుతుంటారు. పెద్ద ఎత్తున పొగ లేచి చుట్టుపక్కల కాలనీలను కమ్మేస్తోంది. విషపూరితమైన వాయువులు వెలువడడంతో అండాలమ్మ కాలనీ ప్రజలు రోగాలబారిన పడ్తున్నారు. ఈ స్కూల్లోని పలువురు స్టూడెంట్లను సైతం ఊపిరితిత్తులు, చర్మ రోగ సమస్యలు చుట్టుముట్టాయి. మరోవైపు రేకుల షెడ్లలో సరైన సౌలతులు లేక స్టూడెంట్లు తిప్పలు పడ్తున్నారు. సరిపడా రూమ్‌లు లేవు. డార్మెటరీ పనులు పూర్తి కాలేదు.
వర్షాలప్పుడు ఇంటికి పోయి అటే
జూలై నెలాఖరులో కురిసిన భారీ వర్షాలకు స్కూల్ ఆవరణ పూర్తిగా జలమయమైంది. ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పేరెంట్స్ వచ్చి తమ పిల్లలను తీసుకెళ్లారు. సెలవుల తర్వాత 640 మందిలో 250 మంది వరకు తిరిగి రాగా, మిగిలిన వాళ్లను పేరెంట్స్ పంపలేదు. వచ్చిన ఆ కొద్ది మంది కూడా ఇక్కడ ఉండలేక ఒక్కొక్కరు ఇంటిదారి పట్టారు. మిగిలిన పిల్లలను టీచర్లే ఇండ్లకు పంపినట్టు సమాచారం. ఈ నెల 14, 15 తేదీల్లో స్కూల్ మొత్తం ఖాళీ అయ్యింది. పిల్లలు లేకున్నా టీచర్లు మాత్రం ఎప్పటిలాగే వచ్చిపోతున్నారు. రెండు రోజుల నుంచి హైస్కూల్ స్టూడెంట్లకు ఆన్లైన్ క్లాస్‌లు చెప్తున్నారు.
సొంత బిల్డింగ్ నిర్మాణానికి ఫండ్స్ లేవ్
ప్రతి నియోజకవర్గానికి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ను శాంక్షన్ చేసిన సర్కారు బిల్డింగులు కట్టడానికి ఫండ్స్ ఇవ్వలేదు. ఈ స్కూల్‌కోసం హాజీపూర్ మండలం గుడిపేటలో ల్యాండ్ కేటాయించి ఏండ్లు గడుస్తున్నా ఫండ్స్ కేటాయించకపోవడంతో బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలు కాలేదు. కాలేజీలో ఎంపీసీ, ఒకేషనల్ గ్రూపులు ఉండగా, ఒక్కో గ్రూపులో 80 మంది చొప్పున ఉన్నారు. రూమ్‌ల కొరత వల్ల ఒకేషనల్ గ్రూపును జైపూర్ స్కూల్లో కొనసాగిస్తున్నారు.
పిల్లల బాధ చూడలేక తీసుకెళ్లినం
మా కొడుకు మణిరత్న ఇక్కడే ఆరో తరగతి చదువుతున్నడు. స్కూల్లో కనీస సౌలతులు లేకపోగా, పక్కనే ఉన్న డంపింగ్ యార్డు పొగతో పిల్లలు రోగాల పాలైతున్నరు. మణిరత్నకు స్కిన్ ఎలర్జీ వచ్చి శరీరమంతా వాపొచ్చింది. హాస్పిటల్‌కు పోతే రూ.40 వేలు ఖర్చయింది. ఇంకా కోలుకోలేదు. చెన్నూర్ మండలం సుద్దాలకు చెందిన నిశాంత్(ఆరో తరగతి)కు ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్ వచ్చి సీరియస్ అయ్యింది. ట్రీట్మెంట్కు రూ.2లక్షలకు పైగా ఖర్చయినట్టు తెలిసింది.
-
దుర్గం రాజు, పేరెంట్, భీమారం
వేరే బిల్డింగ్‌లోకి మార్చుతాం
ఏ నియోజకవర్గానికి శాంక్షన్ అయిన స్కూల్ అండ్ కాలేజీ ఆ పరిధిలోనే నిర్వహించాలన్న రూల్స్ ఉన్నాయి. లేకుంటే ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ఇవ్వదు. దీంతో స్కూల్‌ను గద్దెరాగడి నుంచి అండాలమ్మ కాలనీకి మార్చాం. ఉన్నతాధికారులు పరిశీలించి పర్మిషన్ ఇచ్చాకే ఇక్కడికి షిఫ్ట్ చేశాం. త్వరలోనే అన్ని సౌలతులు ఉన్న బిల్డింగ్‌లోకి మార్చుతాం. - స్వరూపారాణి, రీజినల్ కోఆర్డినేటర్
రూ.30 లక్షలు ఖర్చు చేసినం
మేము ఇంతకుముందు ఇక్కడ ఫంక్షన్ హాల్ నడిపినం. స్కూల్‌కు తీసుకొమ్మని ఎవరినీ అడగలేదు. ఆఫీసర్లే వచ్చి చూసి అనుకూలంగా ఉన్నదని తీసుకున్నరు. ఫంక్షన్ హాల్ సామాన్లు తీసేసి స్కూల్‌కు అనుగుణంగా మార్పులు చేపట్టినం. ఇప్పటికే రూ.30 లక్షల ఖర్చయింది. మూడు నెలలకే స్కూల్‌ను తీసేస్తే మేము లాస్ అయితం.
-
బొలిశెట్టి రాజలింగం, ఫంక్షన్ హాల్ ఓనర్