పురుగుల అన్నం తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 25కు చేరింది. విద్యార్థులను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హాస్టల్‭లో మరికొంత మందికి అస్వస్థతగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నాణ్యత లేని భోజనం కారణంగా తాము అనారోగ్యం పాలైనట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా పురుగులు, రాళ్లు ఉన్న అన్నం పెడుతున్నారని ఆరోపించారు. వాంతాలు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరాలతో తాము తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నా.. ప్రిన్సిపల్, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధాన గేటు తీయాలని ప్రహరీ గోడ ఎక్కి విద్యార్థులు నినాదాలు చేశారు.

అన్నంలో పురుగులు, రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం స్టూడెంట్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పురుగుల అన్నం తిని కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోని వంట మనిషిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పురుగుల అన్నం తిని నిన్న 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక పీహెచ్ సీకి తరలించగా ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.