సమయానికి బస్సు రాకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ధర్నా చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. కోనరావుపేట మండలంలోని మోడల్ స్కూల్‌కి వెళ్లే ఆర్టీసీ బస్సు నిత్యం ఆలస్యంగా వస్తోంది. దీంతో విద్యార్థులు పాఠశాలకు చేరే లోపే చాలా సమయం అయిపోతోంది.
క్లాసెస్ మిస్ అవుతున్న విద్యార్థులు పలు సార్లు అధికారులకు తమ సమస్యను చెప్పారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో బావూసాయిపేట గ్రామ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్సు రెండు రోజులుగా అస్సలు రావట్లేదని విద్యార్థులు వాపోయారు. అధికారులు స్పందించి బస్సు నడపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వేములవాడ డిపో మేనేజర్ సమయానికి బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.