- విద్యార్థులు చెప్పుల్లేకుండా స్కూల్‌కు రావడం బాధించింది: వివేక్
- కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా గొడుగులు, షూస్ పంపిణీ
చెన్నూర్/బెల్లంపల్లి రూరల్/పెద్దపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెల్క ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు చెప్పుల్లేకుండా నడుచుకుంటూ స్కూల్‌కు వస్తున్నారని తెలిసి తానెంతో బాధపడ్డానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం చెన్నూర్‌లోని నల్లగొండ పోచమ్మవాడ విద్యార్థులకు గొడుగులు, బబ్బెరచెల్క స్కూల్ స్టూడెంట్లకు షూస్ పంపిణీ చేశారు.
వివిధ గ్రామాల నుంచి పేద విద్యార్థులు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ రావడాన్ని గమనించిన బబ్బరచెల్క స్కూల్ హెడ్ మాస్టర్ జాకీర్ హుస్సేన్ ఆ విషయాన్ని కాకా వెంకటస్వామి ఫౌండేషన్‌కు తెలియజేశారు. అది విని చలించిపోయిన వివేక్ వెంకటస్వామి షూస్ అందజేశారు. వివేక్ మాట్లాడుతూ, గతంలో ఈ స్కూల్‌కు విశాక చారిటబుల్ ట్రస్ట్ నుంచి బెంచీలు ఇచ్చామన్నారు. విద్యార్థులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమ దృష్టికి తెస్తే విశాక ట్రస్ట్ ద్వారా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అలాగే, వేమనపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ స్కూల్, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గొడుగులు అందజేశారు. బాగా చదువుకొని తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని స్టూడెంట్లకు వివేక్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా రంగాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా వివేక్ గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థులకు కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు విద్యార్థులు వర్షాకాలంలో స్కూల్‌కు రావడానికి ఇబ్బంది పడకుండా గొడుగులు అందజేశామన్నారు.
ఆయా కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్, వెంకటేశ్వర్లు, అక్కల రమేశ్, సుద్దమల్ల సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, రఘునందన్ రెడ్డి, వేల్పుల శ్రీనివాస్, మల్లేశ్, సంతోష్, పత్తి వెంకటకృష్ణ, గణపురం సంతోష్, గొట్టిముక్కుల సురేశ్ రెడ్డి, సజ్జాద్, పర్వతాలు, బాలసాని సతీశ్, అడ్డగుంట శ్రీనివాస్, గంగుల సంతోష్, ఫయాజ్ పాల్గొన్నారు.