కుళ్లిన కూరగాయలతో వంటలు .. జాతీయ రహదారిపై ఏంజేపీ స్టూడెంట్లు, తల్లిదండ్రుల రాస్తారోకో

రేగొండ,వెలుగు :  జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మహత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) స్టూడెంట్లు రోడ్డెక్కారు. కుళ్లిన కూరగాయలతో వంటలు చేస్తున్నారంటూ భూపాలపల్లి పరకాల రహదారిపై  తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి రాస్తారోకో చేశారు. రేగొండ మండల కేంద్రంలో ఏంజేపీ అద్దె భవనంలో కొనసాగుతోంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా పుడ్​ కాంట్రాక్టర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

భోజనంలో నాణ్యత లోపం గురించి ప్రిన్సిపాల్​కు చెప్పినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో   వంటలు చేస్తూ విద్యార్థుల ఆరోగ్యం చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లు స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులను చూసేందుకు వస్తే తమను గేటు ముందే ఉంచి రూల్స్​ గురించి మాట్లాడే టీచర్లు.. తమ కళ్ల ఎదుటే ఇంత అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.