చదువు అవ్వంగనే ఏం చేయకుండా ఇంట్లో కూర్చున్నమా అంతే సంగతి. బయటోళ్లే కాదు.. ఇంట్లోళ్లు కూడా ప్రశ్నలతో సతమతం చేస్తుంటరు.. ఇవన్నీ ఎందుకులే అని చిన్నదో, పెద్దదో ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుందామని సిటీకొస్తరు గ్రాడ్యుయేట్స్.
ఏదో ఒక కోర్సు తీసుకుని కుస్తీలు పడతరు. చదువుకి తగ్గ జాబ్ వస్తే హ్యాపీ లేదంటే ఏదో ఒకటిలే అని క్వాలిఫికేషన్ పక్కనపెట్టి మరో ఉద్యోగంలో చేరుతరు. అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా రిక్రూట్మెంట్ జరగట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో డిగ్రీ పట్టాతో రెడీగా ఉన్న గ్రాడ్యుయేట్స్ పరిస్థితేంటి.. వాళ్ల మనసులో ఏం అనుకుంటున్నరు..ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి జాబ్స్ అయితే బెటర్ అనుకుంటున్నరు?
ప్రస్తుతం మన దేశంలో సగానికి పైగా యూతే ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది యూత్ లేరు. ఇంతమంది ఉన్నప్పుడు, ఇంతమందికి బతకడానికి ఏదో ఒక పని కావాలి. వీళ్లలో పెద్దగా చదువుకోని వాళ్లు ఊళ్లలో, దగ్గర్లోని సిటీల్లో ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్నారు. గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న వాళ్లల్లో నలుగురిలో ఒకరు మాత్రం అన్ఎంప్లాయిమెంట్తో బాధపడుతున్నారు. కరోనా వల్ల ఆ నిరుద్యోగం రేటు మరింత పెరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే డిగ్రీ పట్టాలు అందుకున్న వాళ్ల పరిస్థితేంటనేది పెద్ద ప్రశ్నగా మారింది. అసలు మీరేం అనుకుంటున్నారు.. ఎలాంటి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారని కొంతమంది గ్రాడ్యుయేట్స్‌ని అడిగితే ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పుకొచ్చారు. ఎక్కువమంది మాత్రం సెటిల్మెంట్ అర్థం కావట్లేదని చెప్పారు…
ఏం చేయాలి?
ఫ్యూచర్ ఏంటని అడిగితే సగానికి పైగా యూత్ నుంచి అర్థం కావట్లేదనే ఆన్సరే వచ్చింది. కాలేజీ లైఫ్ అంటే చదువుతో పాటు ఎంజాయ్‌మెంటూ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ అంటే కాలేజీ లైఫ్‌ని మిస్ అవుతున్నామనే ఫీలింగ్‌కి తోడు సెటిల్మెంట్ ఒత్తిడీ ఉంటుంది. అయితే ఈ కరోనా వల్ల ఆ ఒత్తిడి డబుల్ అవ్వడంతో పాటు బ్యూటీఫుల్ కాలేజీ చివరి డేస్‌ని మిస్ అయ్యారు చాలామంది స్టూడెంట్స్. ఫేర్వెల్, ఫ్రెషర్ పార్టీలతో హ్యాపీగా కాలేజీకి సెండాఫ్ ఇవ్వాల్సిన వాళ్లు వైరస్ దెబ్బకి అన్నింటికి దూరమయ్యి ఇంటికే పరిమితమయ్యారు. పైగా లెక్చరర్స్ గైడెన్స్ లేదు.. ఏవో తిప్పలు పడి జాబ్ తెచ్చుకుందామంటే ఎక్కడా రిక్రూట్మెంట్ లేదు.. పైగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ కూడా మొత్తం తెరుచుకోలేదు.. వీటన్నింటినీ ఆలోచిస్తే ఫ్యూచర్ అర్థం కావట్లేదంటున్నారు చాలామంది గ్రాడ్యుయేట్స్..
బిజినెస్ బెటర్
మన దురదృష్టం కొద్దీ ఫ్యూచర్లో ఇంతకన్నా ప్రమాదకరమైన వైరస్లు రావొచ్చు. అప్పుడు మరిన్ని ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది.. ఒకవేళ లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగాలున్నా మనం ఆఫీసుకెళ్లే ధైర్యం చేయలేకపోవచ్చు.
అందుకే బిజినెస్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు కొందరు గ్రాడ్యుయేట్స్. మా బతుకు మాదే అనుకుంటూ చిన్నచిన్న వ్యాపారాలు మొదలుపెట్టాలనుకుంటున్నాం అంటున్నారు. ఈ బిజినెస్ విషయంలో పెద్ద కలలు కనేవాళ్లూ ఉన్నారు. అంటే కొత్తవి కనిపెట్టాలనుకునే వాళ్లు.. తమకు తాముగా ఎదగాలనుకుంటున్న వాళ్లు ఉన్నారు..
క్రియేటివ్ ఫీల్డ్
సెటిల్మెంట్ ఏంటని అడిగితే చదివిన చదువుతో సంబంధం లేకుండా ప్యాషన్‌ని బయటపెట్టారు కొందరు యూత్. యాక్టింగ్, ఫిల్మ్ మేకింగ్ , ఫొటోగ్రఫీ, డ్యాన్స్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్‌లో పనికి కొదవ లేదనేది కొందరి గ్రాడ్యుయేట్స్ ఒపీనియన్. టాలెంట్ ఉంటే చాలు ఈ ఫీల్డ్స్‌లో అవకాశాలతో పాటు కావాల్సినంత ఫేమ్ కూడా వస్తుంది.
అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్ని పక్కనపెట్టి ప్యాషన్‌ని కొనసాగించాలి అనుకుంటున్నారు కొందరు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కొందరు గ్రాడ్యుయేట్స్ మాత్రం దాన్నే ప్రొఫెషన్‌గా మార్చుకుని పొలాల్లో దిగే ఆలోచనలో ఉన్నారట. కొందరు ప్యాషన్‌ని నమ్ముకుంటాం అంటుంటే, కొందరు మాత్రం బిజినెస్ బెటర్ అంటున్నరు. ఇంకొందరు మాత్రం ఫ్యూచర్‌పై వాళ్లకున్న భయాల్ని, ఆలోచనల్ని బయటపెడుతున్నరు.
రోజులు గడిచిపోతున్నయ్
ఎగ్జామ్స్ పూర్తి అవ్వంగనే సిటీ కొచ్చి జావా కోర్సులో జాయిన్ అయ్యా.. కోర్సు పూర్తయ్యే సరికి ఆరు నెలలు పట్టింది. ఆ తర్వాత సాప్ (SAP)కి డిమాండ్ ఉందని తెలిసి అందులో జాయిన్ అయ్యా.. కోర్సు పూర్తికాకముందే కరోనా వచ్చి పడింది. హాస్టల్స్ అన్నీ క్లోజ్ చేయడంతో చేసేదేంలేక ఇంటికొచ్చా. ఆరు నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నా. ఇంకెన్నాళ్లు ఉండాల్సి వస్తుందో తెలీదు. ఇప్పటికీ బీటెక్ కంప్లీట్ అయ్యి సంవత్సరంన్నర అయింది. రోజురోజుకి జాబ్ టెన్షన్ పెరుగుతోంది. పైగా కొద్దిరోజుల్లో మా జూనియర్స్ కూడా మాకు కాంపిటీషన్‌గా వస్తారు. ఎవర్ని అడిగినా ఇప్పట్లో రిక్రూట్మెంట్ జరగదంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. – రమ్య, బీటెక్
ఒత్తిడి పెరుగుతోంది
ప్రజెంట్ పరిస్థితుల్ని చూశాక ఉద్యోగాలు అంత సెక్యూర్డ్ కాదనిపిస్తుంది. ఏదైనా బిజినెస్ చేయాలనుంది.కానీ, ఆర్థికంగా అంత స్థోమత లేదు. అందుకే ఇష్టం లేకపోయినా ఉద్యోగం వైపు వెళ్లాలనుకుంటున్నా.. కానీ, ప్రస్తుతం ఎక్కడా ఎక్కువగా ఉద్యోగాలు లేవు. ఒకవేళ తెలిసిన వాళ్ల ఎక్కడైనా ఉద్యోగముందని చెప్తున్నా పంపించడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవట్లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఏం అవసరం లేదంటున్నారు. దాంతో నాన్నకి వ్యవసాయ పనుల్లో సాయం చేస్తున్నా.. కానీ, ఇలా ఎన్నాళ్లని ఉంటాం. పరిస్థితులు నార్మల్ అయితే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడతా.. కార్పొరేట్ జాబ్ దొరక్కపోతే ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతా. – చంద్రశేఖర్, గ్రాడ్యుయేట్