సర్పంచ్ గుడ్ జాబ్ : కొలువులకు కేరాఫ్ ప్రేరణ

ఎంతోమందికి కొలువులు..

వేల రూపాయల ఫీజులు కట్టి.. కోచింగ్​కు వెళ్లి..  ఎన్నో పోటీ పరీక్షలు రాసి.. ఉద్యోగాలు రాక విసిగిపోయినవారు కూడా సెకండ్​ ఇన్నింగ్స్​లో ఈ  స్టడీ సెంటర్​కు వచ్చి, మరింత పట్టుదలగా చదివి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరికొంతమంది అసలు ఏ కోచింగ్​ సెంటర్​కు వెళ్లకుండానే ఫస్ట్ అటెంప్ట్​కే కేవలం ఈ స్టడీ సెంటర్​లోనే చదువుకొని జాబ్స్​ కొట్టేశారు. మరికొందరైతే ఆల్​రెడీ జాబ్స్​ సాధించినా.. మరింత బెటర్​ జాబ్​ కోసం ప్రేరణకే వచ్చి ప్రిపేర్​ అవుతున్నారు. ఇక జాబ్​ వచ్చినవాళ్లు తాము ప్రిపేర్​ అయిన పుస్తకాలను, రాసుకున్న నోట్స్​ను, తయారుచేసుకున్న మెటీరియల్​ను స్టడీ సెంటర్​లో చదివే మిగతా పిల్లలకు తెచ్చి ఇస్తున్నారు. దీంతో రూపాయి ఖర్చు లేకుండా ప్రిపేర్​ అవుతూ, జాబ్​ కొడుతున్నారు.

ఇంట్లో అమ్మానాన్నలు చదువుకున్నవాళ్లయితే.. డెఫినెట్​గా పిల్లలనూ బాగా చదివిస్తారు. అదే ఊరి సర్పంచ్​ చదువుకున్నోడైతే.. ఊళ్లో పిల్లల చదువు గురించి ఆలోచిస్తాడు. నిజామాబాద్​ జిల్లా, రుద్రూర్​ గ్రామ సర్పంచ్​ ఇందూరు చంద్రశేఖర్​ కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఎందుకంటే… సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా ఊళ్లో సదుపాయాలు కల్పించడం గురించి ఆలోచిస్తాడు. పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ కంప్లీట్​ చేసిన సర్పంచ్​ చంద్రశేఖర్​ మాత్రం.. ఊళ్లో సదుపాయాల కల్పనకు కృషి చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కష్టాల గురించి ఆలోచించాడు. ఎక్కడో ఉన్న హైదరాబాద్​కు వెళ్లి, వేలాది రూపాయలు ఖర్చుచేసి కోచింగ్​ తీసుకునే బదులు ఊళ్లోనే ప్రిపేర్​ అయ్యేలా ఓ స్టడీ సెంటర్​ ఏర్పాటు చెయ్యాలని అనుకున్నాడు. తన ఆలోచనలను ఊళ్లో కొంతమంది పెద్దలతో పంచుకున్నాడు.

మంచిపనికి మద్దతు పలికేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. సర్పంచ్​ చంద్రశేఖర్​ ఆలోచనను విన్న ఊరి పెద్దలు, అప్పటికే ఉద్యోగాల్లో స్థిరపడినవారు అంతా ముందుకొచ్చారు. అందరికీ అందుబాటులో ఉండే గాంధీ సెంటర్​లో ఉన్న తన ఇల్లును స్టడీ సెంటర్​ కోసం ఇస్తానంటూ ముందుకొచ్చాడు బచ్చు రామ్. విద్యార్థులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మామిండ్ల చంద్రశేఖర్​ గౌడ్.. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్​ను తాను సమకూరుస్తానని మాటిచ్చాడు. పిల్లలు చదువుకునేందుకు అవసరమైన టేబుల్స్​, చైర్స్​, రైటింగ్​ ప్యాడ్స్​ లాంటివి ఇచ్చేందుకు మరికొంతమంది ముందుకొచ్చారు. ఇక నెలనెలా మెయింటెనెన్స్​కు అయ్యే ఖర్చును తాను భరిస్తానని చెప్పాడు ఇందూరు విద్యాసంస్థల చైర్మన్​ కిషోర్​. గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు తాము అవసరమైతే కోచింగ్​ ఇస్తామన్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు కూడా కోచింగ్​ ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

‘ప్రేరణ’గా పేరు..

మొత్తానికి ఓ స్టడీ సెంటర్​కు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరాయి. మంచి పనికి ముహూర్తమేదీ అక్కర్లేదన్నట్లు.. అనుకున్నవెంటనే స్టడీ సెంటర్​ ఏర్పాటైంది. అంతమందిని ఒకతాటిపైకి తెచ్చి, అందరికీ ప్రేరణగా నిలిచిన స్టడీ సెంటర్​కు ఏ పేరు పెడితే బాగుంటుంది? అనే ప్రశ్నకు ఆన్సర్​ కూడా వెంటనే దొరికేసింది. ‘ప్రేరణ స్టడీ సెంటర్​’ అని పేరు పెడదామని బచ్చురామ్​ భార్య రమాదేవి సూచించారు. అందరూ ఓకే అనడంతో వారం తిరగకముందే ‘ప్రేరణ స్టడీ సెంటర్​’ మొదలైంది.

పొద్దున్నే ఏడింటి నుంచే..

పరీక్ష ఏదైనా సరే.. ప్రిపేర్​ అయ్యేందుకు అవసరమైన అన్నిరకాల పుస్తకాలు, ప్రైవేటు కోచింగ్​ సెంటర్ల మెటీరియల్స్​ను సిద్ధంగా ఉంచారు. పదిమందితో మొదలైన ఈ స్టడీ సెంటర్​కు వచ్చే స్టూడెంట్స్ సంఖ్య మెల్లమెల్లగా పెరిగింది. దీంతో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు మరికొంతమంది దాతలు ముందుకొచ్చారు. పొద్దున్నే ఏడింటికల్లా ఈ స్టడీ సెంటర్​ తలుపులు తెరుచుకుంటాయి. ఒక్కొక్కరుగా వచ్చి చదువులో లీనమైపోతుంటారు. పొద్దుపోయేదాకా చదువుతూనే ఉంటారు. సాయంత్రం స్కూళ్లు, కాలేజీల నుంచి వచ్చే టీచర్లు, లెక్చరర్లు కూడా కొంచెంసేపు వచ్చి ఇక్కడ గడిపిపోతారు. ఏవైనా డౌట్లు ఉంటే క్లియర్​ చేస్తారు. ఇంగ్లీష్​, తెలుగు గ్రామర్​, రీజనింగ్​ క్లాసులు కూడా చెప్తారు. ఏదైనా నోటిఫికేషన్ పడిందంటేచాలు.. ప్రేరణ స్టడీ సెంటర్​ కిటకిటలాడుతుంది.

పక్క ఊళ్ల నుంచి కూడా..

మండల కేంద్రమైన రుద్రూర్​ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు మధ్యలో ఉండడం, రహదారి సదుపాయం కూడా బాగుండడంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాన్సువాడ నుంచి కూడా స్టూడెంట్స్ టిఫిన్​ బాక్సులు కట్టుకొని మరీ వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు.

ఆడపిల్లలు కూడా..

గ్రామం మధ్యలో గాంధీ సెంటర్​లో ఉండడంతో సెక్యూర్డ్​గా ఉంటుందని ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఈ స్టడీ సెంటర్​కు పంపిస్తున్నారు. పైగా ఊరి పెద్దమనుషుల్లో ఎవరో ఒకరు ఈ స్టడీ సెంటర్​ బాగోగులు తెలుసుకునేందుకు వస్తూనే ఉంటారు.  ఆడపిల్లలు చదువుకునేందుకు వస్తున్నారని ఊరి పెద్దలు ఈ స్టడీ సెంటర్​లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పైగా ఎవరు ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారు? పూర్తి వివరాలను రిజిస్టర్​లో రాస్తారు.

ఓ మినీ లైబ్రరీ..

పదుల సంఖ్యలో పుస్తకాలతో మొదలై  ఇప్పుడు కనీసం 70వేల రూపాయలకుపైగా విలువ చేసే పుస్తకాలున్నాయి. ఇక్కడ ఇవేకాకుండా రకరకాల మెటీరియల్స్​, ప్రిపేర్​ అయినవాళ్లు రాసుకున్న నోట్స్​ కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం చదువుకోవాలనే తపన ఒక్కటుంటే చాలు.. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ప్రిపేర్​ కావొచ్చు.

ఎటువంటి డిస్టర్బెన్స్​ ఉండదు..

ఈ స్టడీ సెంటర్​కు వచ్చేవాళ్లంతా ఈసారే ఉద్యోగం సంపాదించాలన్న కసితో వస్తుంటారు. దీంతో మాటలతో టైం వేస్ట్​ చేసేవాళ్లు కనీసం ఒక్కరు కూడా కనిపించరు. ఎప్పుడు చూసినా ‘పిన్​డ్రాప్ సైలెన్స్​’ వాతావరణమే కనిపిస్తుంది. ఇంకో విశేషమేంటంటే… ఇందులోకి అడుగుపెట్టగానే సెల్​ఫోన్​ సిగ్నల్​ కట్​ అవుతుంది. అందుకని ఎవరైనా ఫోన్​ చేస్తే డిస్టర్బ్​ అయ్యే ఛాన్స్​ కూడా లేదు.

జాబ్స్ వస్తుంటే హ్యాపీగా ఉంది..

కోచింగ్​ కోసం హైదరాబాద్​కు వెళ్లే పిల్లల అవస్తలు, వాళ్ల తల్లిదండ్రులు పడే బాధలను చాలా దగ్గరగా చూశాను. డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ పంపిస్తున్నారు. ఎంతో కష్టపడి కోచింగ్​కు వెళ్తే.. జాబ్ వస్తే హ్యాపీనే, రాకపోతే..? తల్లిదండ్రుల కష్టం వృథా అయినట్టే. పైగా ఒకసారి కోచింగ్​కు వెళ్లినవాళ్లు మళ్లీ మళ్లీ వెళ్లలేరు. ఇంట్లోనే ప్రిపేర్​ అవుదామనుకుంటారు. డబ్బులు ఖర్చుపెట్టే స్తోమత లేక కూడా కొందరు ఇంటివద్దే ప్రిపేర్​ అవుదామనుకుంటారు. వాళ్లందరూ చదువుకునేలా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనిపించింది. నా ఆలోచనను ఊళ్లోవాళ్లతో పంచుకున్నా. స్టడీ సెంటర్​ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని అడిగా. అందరూ ఆలోచన బాగుందన్నారు. వెంటనే ఊళ్లో కొందరు పెద్దమనుషులను కలిసి స్టడీ సెంటర్ ఏర్పాటు గురించి చెప్పడంతో అందరూ ముందుకు రావడం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఇప్పటిదాకా మా ఊరి పిల్లలే దాదాపు 15 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. చుట్టుపక్కల గ్రామాల స్టూడెంట్స్​ కూడా ఇప్పుడు మా ఊరికొచ్చి చదువుకుంటున్నారు. దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాన్సువాడ నుంచి కూడా స్టూడెంట్స్ వస్తున్నారని తెలియగానే ఎంతో హ్యాపీగా అనిపించింది. సర్పంచ్​గా కాకుండా చదువంటే ఇష్టమున్న వ్యక్తిగా నా వంతుగా కూడా ప్రతినెలా కొంత మొత్తం ఇస్తున్నా. ప్రేరణ స్టడీ సెంటర్​లో చదివి, జాబ్ వచ్చినవాళ్లు నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్​ చెబుతుంటే.. ప్రేరణ ఏర్పాటుకు సహకరించిన వాళ్లందరికీ నేను థ్యాంక్స్​ చెబుతుంటా. ఊళ్లో ఎన్నో సదుపాయాలు కల్పించినా సర్పంచ్​గా అది నా బాధ్యత మాత్రమే అనుకుంటా. కానీ .. పిల్లలకు జాబ్​ వచ్చిందని తెలిసినప్పుడు మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుంది.                                                                                                      – ఇందూరు చంద్రశేఖర్​, సర్పంచ్, రుద్రూర్​

అన్ని సదుపాయాలు ఉన్నాయి..

కష్టపడి చదివి, జాబ్​ కొట్టాలన్న ఒక్క కోరికతో ప్రేరణకు వస్తే చాలు.. అవసరమైన అన్ని పుస్తకాలు ఉన్నాయి. సీనియర్స్​ గైడెన్స్​ కూడా ఇస్తారు. ఎటువంటి డిస్టర్బెన్స్​ ఉండదు. వెటర్నరీ అసిస్టెంట్​గా జాబ్​ వచ్చిందంటే దానికి కారణం ప్రేరణే. మాలాంటి వాళ్ల కోసం దీనిని ఏర్పాటు చేసిన సర్పంచ్​కు ఎన్నిసార్లు థ్యాంక్స్​ చెప్పినా తక్కువే.                                                        ‌‌‌‌_ ఎం. సుధీర్​, వెటర్నరీ అసిస్టెంట్​, కోటగిరి

ప్రతి నిమిషం ఉపయోగపడింది..

ఇక్కడ చదువుకోవడం గొప్ప అవకాశం. చదువుకునేటప్పుడు ఏ డౌట్స్​ వచ్చినా వెంటనే ఎవరో ఒకరు క్లియర్​ చేసేవాళ్లు. నిజామాబాద్​లో రూమ్​ తీసుకొని చదివినా ఎంతో టైమ్​ వేస్ట్​ అయ్యేది. ఈ స్టడీ సెంటర్​లో  మాత్రం చదివిన ప్రతి నిమిషం ఎంతో ఉపయోగపడింది. అదే తెలుగు పండిట్​ ఉద్యోగం సంపాదించేలా చేసింది. ప్రస్తుతం సిర్పూర్​లో జాబ్​ చేస్తున్నా.                           – శానం సాయిలు,  తెలుగు పండిట్

రూపాయి ఖర్చు లేకుండా..

చుట్టూ చదువుకునేవాళ్లే.. అందరూ ఉద్యోగం సంపాదించాలన్న తపన ఉన్నవాళ్లే.. వాళ్లతోపాటు చదువుకోవడం నాకు ఎంతగానో ఉపయోగపడింది. రూపాయి ఖర్చు లేకుండా ప్రిపేర్​ అయ్యే అవకాశం ప్రేరణ స్టడీ సెంటర్​ వల్లే కలిగింది. వెటర్నరీ అసిస్టెంట్​గా జాబ్​ వచ్చిందంటే అందులో ప్రేరణ పాత్ర ఎంతో ఉంది.  స్టడీ సెంటర్​ కోసం ఫ్రెండ్స్​తో కలిసి ఓ సిస్టమ్​  ఇచ్చాం. ఫ్యూచర్​లో ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

– అడప వినోద్​, వెటర్నరీ అసిస్టెంట్ 

నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు..

గవర్నమెంట్ జాబ్​ కోసం ఎంతగా కష్టపడ్డానో నాకు తెలుసు. అయినా అది నాకు దక్కలేదు.  కారణం.. సరైన గైడెన్స్​ లేకనే. కోచింగ్​కు వెళ్లలేక ఇంట్లోనే ప్రిపేర్​ అయ్యేవాళ్లందరిదీ ఇదే పరిస్థితి. అందుకే ప్రేరణలో చదువుకుంటున్న పిల్లలకు సరైన గైడెన్స్​ ఇవ్వాలనిపించింది. ఓ టీచర్​గా నాకున్న నాలెడ్జ్​ను పిల్లలతో పంచుకున్నా. అది వాళ్లకు యూజ్​ఫుల్​గా ఉంటుందని అనుకున్నా. అందుకే టైం దొరికినప్పుడల్లా స్టడీ సెంటర్​కు వెళ్లి క్లాసులు చెప్పాను.                                                                                                     – జి. విశ్వప్రసాద్​, ప్రైవేట్​ స్కూల్​ టీచర్​

పట్టుదల పెంచింది..

స్టడీ సెంటర్​లో చదువుతున్న వాళ్లలో జాబ్​ కొట్టాలనే కసి కనిపిస్తుంది. కోచింగ్​కు వెళ్లినా అంతగా  చదవని నేను.. ప్రేరణ స్టడీ సెంటర్​లో  మాత్రం చాలా పట్టుదలతో చదివాను. తెలుగు పండిట్​ టీచర్​గా జాబ్​ సాధించాను. అప్పటికే జాబ్స్​ చేస్తున్న సీనియర్స్​ వచ్చి గ్రామర్​, కరెంట్​ అఫైర్స్​పై చెప్పిన క్లాస్​లు ఎంతో బాగా ఉపయోగపడ్డాయి.                                                                         – గంగోని రోజా, తెలుగు పండిట్​

పుట్టి పెరిగిన ఊరి కోసం ఏదైనా చెయ్యాలనుకున్నా..

రుద్రూర్​.. నేను పుట్టిపెరిగిన ఊరు. నా ఊళ్లోని స్టూడెంట్స్​ కోసం ఈ స్టడీ సెంటర్​ ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పుడు నా వంతుగా కూడా ఏదైనా చెయ్యాలనిపించింది. ఎంతో కష్టపడి చదివే స్టూడెంట్స్​కు జాబ్స్​ వస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఓ టీచర్​గా నాకు బాగా తెలుసు. మా స్కూల్లో చదివే స్టూడెంట్స్ అప్పుడప్పుడు కనిపించి ఫలానా జాబ్ వచ్చిందని చెప్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. కష్టపడి చదివే స్టూడెంట్స్ అంటే ఎంతో ఇష్టపడే నేను.. వాళ్ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడను. కాంపిటేటివ్​ ఎగ్జామ్స్​ కోసం ప్రిపేర్​ అయ్యే స్టూడెంట్స్​ కోసం ఇలా ఓ స్టడీ సెంటర్​ను ఏర్పాటు చేస్తున్నారని సర్పంచ్​ చంద్రశేఖర్​ చెప్పగానే.. ‘నా వంతుగా ఏం చేయాలి’ అని అడిగాను. ఇప్పటికీ ప్రతినెలా స్టడీ సెంటర్​ మెయింటెనెన్స్​కు అయ్యే ఖర్చులో  కొంత చెల్లిస్తున్నాను. అవసరమైతే ఇంకా ఏదైనా చెయ్యడానికి నేను సిద్ధమే.  – ఇందూరు విద్యాసంస్థల చైర్మన్​ కె. కిశోర్

కిరాయి కాదు.. పిల్లలకు చదువు ముఖ్యమనుకున్నా..

డబ్బు ఉన్నంత మాత్రాన అది సంతోషాన్నివ్వదు. కేవలం స్టేటస్​ను మాత్రమే ఇస్తుంది. మన సంతృప్తి కోసం పూజలు, యజ్ఞాలు, సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. అయితే వాటి ఫలితం మనకు కంటికి కనిపించదు. కానీ ప్రేరణ స్టడీ సెంటర్​ ఏర్పాటు విషయంలో మేం చేసిన మంచి పనికి ఫలితం కనిపిస్తోంది. ఎంతోమంది పిల్లలు స్టడీ సెంటర్లో చదువుకొని, ఉద్యోగాలు పొందుతుంటే సంతృప్తిగా అనిపిస్తుంది. ప్రేరణ స్టడీ సెంటర్​ ఏర్పాటు గురించి సర్పంచ్​ చంద్రశేఖర్​ చెప్పగానే ఇల్లు ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించలేదు. కిరాయి కాదు… పిల్లలకు చదువు ముఖ్యమనుకున్నా. నా భార్య  రమాదేవి కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేద్దామని చెప్పింది. స్టడీ సెంటర్​ పేరును కూడా ఆమే సూచించింది.                                                                                             – బచ్చు రామ్​, ప్రేరణ స్టడీ సెంటర్​కు ఇల్లు ఇచ్చిన వ్యక్తి

see also: తిరంగా స్టైల్ : రిపబ్లిక్‌ డే స్పెషల్‌

కరీంనగర్లో అర్ధరాత్రి ఓటర్లకు డబ్బుల పంపకం

వేడినీళ్లతో ఎంతో మంచిది