COVID-19 pandemic: వామ్మో.. 2020లో కరోనా అంత మందిని పొట్టనపెట్టుకుందా..?

COVID-19 pandemic: వామ్మో.. 2020లో కరోనా అంత మందిని పొట్టనపెట్టుకుందా..?

ఢిల్లీ: భారత్లో ఒక్క 2020వ సంవత్సరంలోనే 11.9 లక్షల మంది చనిపోయినట్లు ఒక అంతర్జాతీయ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన కరోనా మరణాల సంఖ్య కంటే ఏకంగా 8 రెట్లు ఎక్కువ మంది మన దేశంలో 2020వ సంవత్సరంలో మరణించినట్లు తేలింది.భారత్లో కరోనా మరణాలపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొన్న సంఖ్య కంటే 1.5 రెట్లు ఎక్కువ మంది ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ఈ అంతర్జాతీయ అధ్యయనం పేర్కొంది.  2019లో నమోదైన మరణాలతో పోల్చితే కరోనా మహమ్మారి వల్ల 2020లో మరణాల సంఖ్య 17 శాతం పెరిగినట్లు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్లో భారతి సంతతికి చెందిన స్కాలర్స్ , న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ ఆర్థికవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది.

కరోనా ఉపద్రవం వల్ల భారతదేశంలో చనిపోయిన వారి డేటాను వయసు, లింగ, సామాజిక నేపథ్యాల వారీగా సేకరించారు. మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజల ఆయు:ప్రమాణం గణనీయంగా తగ్గిపోయినట్లు తేల్చారు. 7.65 లక్షల మంది డేటాను అధ్యయనం చేశాక ఈ వివరాలను సదరు అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. 2019, 2020లో జనన, మరణాల సంఖ్యను పోల్చి చూసింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సంస్థ National Family Health Survey (NFHS-5) నుంచి ఈ డేటాను స్టడీ చేసిన సంస్థ తీసుకుంది. 2020లో భారత్లో కరోనా విలయ తాండవం తర్వాత మహిళల ఆయు: ప్రమాణం (Life Expectancy) 3.1 సంవత్సరాలు, పురుషుల ఆయు: ప్రమాణం 2.1 సంవత్సరాలు తగ్గినట్లు స్టడీలో తేలింది. 

ALSO READ | ప్రపంచ ఐటీ సంక్షోభం : ఏయే రంగాలు కుప్పకూలాయో తెలిస్తే షాక్ అవుతారు..!

సామాజిక వర్గాల, మతాల వారీగా కూడా ఈ స్టడీ అధ్యయనం చేసింది. హిందువుల్లో ఆయు: ప్రమాణం 1.3 సంవత్సరాలు, ముస్లిమ్స్లో 5.4 సంవత్సరాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్లో  (ST) 4.1 సంవత్సరాలు ఆయు: ప్రమాణం తగ్గిందని ఈ అధ్యయనం వివరించింది. అగ్రవర్ణాలతో పోల్చితే భారత్లో వెనుకబడిన సామాజిక వర్గాల్లో ఆయు: ప్రమాణం ముందు నుంచి తక్కువగానే ఉందని, కరోనా ఈ వ్యత్యాసాన్ని మరింత పెంచిందని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

ఇదిలా ఉండగా ఈ అధ్యయనాన్ని నీతి ఆయోగ సభ్యులు వినోద్ పాల్ తప్పుబట్టారు. ఈ అధ్యయనం జరిగిన తీరులోనే లోపాలున్నాయని, ఈ సర్వే చేసిన బృందం అంతిమంగా తప్పుడు వివరాలతో అధ్యయనానికి చరమ గీతం పాడిందని ఆరోపించారు. India’s civil registration system (CRS) గణాంకాల్లో 99 శాతం మరణాలు నమోదయ్యాయని తెలిపారు. 2019తో పోల్చితే 4.74 లక్షల మరణాలు నమోదయ్యాయని, ఈ అధ్యయనం చెబుతున్నట్లు 11.9 లక్షల మరణాలు కాదని వినోద్ పాల్ చెప్పుకొచ్చారు. 11.9 లక్షల మంది చనిపోయారని వెల్లడించడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. 2020లో కరోనా వల్ల 1.49 లక్షల మంది చనిపోయారని తెలిపారు. అయితే.. CRS గణాంకాల్లో పేర్కొన్న మరణాలన్నీ కరోనా మరణాలు కాదని ఆయన గుర్తుచేశారు.