భద్రాద్రిలో అధ్యయనోత్సవం షురూ

భద్రాద్రిలో అధ్యయనోత్సవం షురూ
  • తొళక్కంతో శ్రీకారం, ఉత్సవమూర్తులకు ప్రత్యేక స్నపనం

భద్రాచలం, వెలుగు : భద్రగిరిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో రామక్షేత్రం మారుమోగింది. భక్తులతో కిటకిటలాడింది. ముందుగా ఉత్సవమూర్తులకు ఏకాంతంగా గర్భగుడిలో ప్రత్యేక స్నపనం నిర్వహించారు. ఆ తరువాత మత్స్యవతారంలోని రామయ్యను బేడా మండపంలోకి తీసుకొచ్చి భక్తుల దర్శనార్థం ఉంచారు. సీతారామచంద్రస్వామి తొలిరోజు భక్తులకు మత్స్య అవతారంలో దర్శనమిచ్చారు. బుధవారం స్వామి కూర్మావతారంలో దర్శనం ఇవ్వనున్నారు. 

తొళక్కంతో శ్రీకారం..

అధ్యయనోత్సవాల్లో భాగంగా చతుర్వేద, రామాయణ పారాయణం చేసే రుత్విక్కులు, వేద పండితులకు దీక్షా వస్త్రాలను ఈవో రమాదేవి అందజేశారు. ఆ తరువాత ప్రత్యేక ఆరాధనలో ముందుగా వేదాలు, ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రి క్షేత్ర మహత్యం, దివ్య ప్రబంధంతో అధ్యయాన్ని ప్రారంభించారు. దీనిని సంప్రదాయబద్ధంగా తొళక్కం అంటారు. గంటపాటు నాళాయర దివ్య ప్రబంధంలోని పద్యాలను సేవాకాలం చేశారు.

ఆ తరువాత కోలాటాలు, రామనామ స్మరణతో మత్స్యవతార రామయ్యను ఊరేగింపుగా ఆలయం నుంచి వైకుంఠ ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపైకి తీసుకొచ్చారు. సాయంత్రం భక్తుల జయజయధ్వానాల మధ్య మత్స్యవతార రామయ్య తిరువీధి సేవకు బయలుదేరారు. అధ్యయనోత్సవాల్లోని పగల్​పత్​ ఉత్సవాల్లో స్వామి దశావతారాల్లో దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో జనవరి 10 వరకు నిత్య కల్యాణాలను రద్దు చేశారు.