
ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రకటించే ఆస్తులు, ఆదాయపు పన్ను డేటా, ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలను పరిశీలిస్తే.. భారతదేశంలోని ధనికులు తమ ఆదాయాలను దాచిపెట్టి తక్కువగా చూపుతున్నారని వెల్లడైంది. ఆదాయపు పన్ను డేటాలో సంపన్నులు తక్కువగా పన్నులు చెల్లిస్తున్నట్లు ఆర్బీఐ ఎంపీసీ సభ్యుడు రామ్ సింగ్ నిర్వహించిన ఒక రీసెర్చ్ లో వెల్లడైంది. ఎక్కువ సంపద కలిగినవారు చాలా తక్కువ పన్నులు చెల్లిస్తున్నారని ఆయన గమనించారు.
ధనికులు తమ మెుత్తం ఆస్తుల్లో కేవలం ఒక్క శాతం కంటే తక్కువ పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని సింగ్ వెల్లడించారు. టాప్ సంపన్న వర్గాలు నివేదించిన ఆదాయ-సంపద నిష్పత్తులు వారి ఆస్తులపై రాబడి రేటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని పరిశోధన వాదిస్తోంది. సంపదకు సంబంధించి భారత పన్ను విధానం ప్రగతిశీలంగా లేదని రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. చాలా మంది సంపన్నుల ఆస్తుల విలువ పెరుగుతుంటే వారు చూపుతున్న ఆదాయం తగ్గుతోందని ఈ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది.
కింది స్థాయిలో ఉన్న 10 శాతం ప్రజల ఆదాయం వారి సంపద కంటే రెండింతలుగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే ధనవంతుల విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉండటం అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎంత ఎక్కువ సంపదలు కలిగి ఉంటే వారు అంత తక్కువ పన్నులను చెల్లిస్తున్నారని తేలింది. ఫోర్బ్స్ జాబితాలో ఉన్న సంపన్నులు క్యాపిటల్ ఇన్కమ్ కేవలం 5 శాతం కంటే తక్కువగా చూపుతున్నారని తేలింది. దీంతో మెుత్తం మీద సంపన్నులు తమ మెుత్తం ఆస్థి విలువలో కేవలం 1 శాతం కంటే తక్కువ ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని వెల్లడైంది.
రీసెర్చ్ రిపోర్టులో రాజకీయ నాయకులకు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సగటు రాజకీయ నాయకుడు సాధారణ పౌరుడి కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నాడని వెల్లడైంది. అయితే ఎన్నికల్లో గెలిచిన పొలిటీషియన్స్ సంపద మరింత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 2019లో లోక్ సభలోని సగటు వ్యక్తి కుటుంబం సంపద విలువ లక్ష డాలర్లకు దగ్గరగా ఉందని వెల్లడైంది. ఇదే క్రమంలో సగటు భారతీయ కుటుంబ సంపద 26వేల 867 డాలర్లుగా ఉన్నట్లు వెల్లడైంది.
చాలా మంది సంపన్నులు తమ పన్ను ఆదాయాన్ని తగ్గించుకునేందుకు వ్యవసాయ ఆదాయాన్ని పెంచటం, కమర్షియల్ ప్రాపర్టీలు, రియల్ ఎస్టేట్ ఆదాయాలను తగ్గించి చూపించటం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారని వెల్లడైంది. మెుత్తం సంపాదనలో కొంత భాగాన్ని మాత్రం తప్పుగా తక్కువ చేసి చూపిస్తున్నారని, ఇది తక్కువ పన్ను చెల్లింపులకు దారితీస్తోందని వెల్లడైంది.
ALSO READ : కొంపముంచిన టారిఫ్ వార్.. ఇన్వెస్టర్ల సంపద రూ.11.30 లక్షల కోట్లు ఆవిరి
మెుత్తానికి రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం సంపన్న వ్యక్తులు ఆదాయం పన్ను రిటర్న్‌ల్లో పన్ను బాధ్యత తగ్గించి చూపటం కారణంగా వారి చేతుల్లో లేదా కంపెనీ ఖాతాల్లో ఎక్కువ ఆదాయం మిగిలిపోతుంది. ఇది క్రమంగా అధిక పెట్టుబడులకు దారితీస్తుంది, ఫలితంగా మొత్తం ఆర్థిక వ్యవస్థకు అధిక ఉపాధి అవకాశాలు వృద్ధి రేట్లు లభిస్తున్నాయని అధ్యయనం పేర్కొంది.