జీవావరణ అనుక్రమం

 భౌతిక పరిస్థితుల వల్ల ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలాన్ని  బట్టి, ప్రాంతాన్ని బట్టి శీతోష్ణస్థితి లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒక జీవన సమాజ స్థానంలో మరో రకమైన జీవ సమా జాలు ఆవిర్భావం చెందడం ఆవరణ అనుక్రమం లేదా ఒక ప్రదేశాన్ని క్రమానుగతంగా వేర్వేరు జీవ జీవుల సంఘాలు ఆక్రమించడాన్ని ఆవరణ అనుక్రమం అంటారు. ఇది నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ చివరకు స్థిరమైన జీవ సమాజం ఏర్పడుతుంది. దీన్నే పరాకాష్ట జీవ సమాజం అని పిలుస్తారు. ఇందులోని జాతులకు పరాకాష్ట జాతులు అంటారు. పరాకాష్ట జీవ సమాజాలు వాటి చుట్టూ ఉన్న పర్యావరణంతో సమతుల్యంగా ఉంటాయి.

పర్యావరణంలోని వివిధ జాతి జీవుల మధ్య, జీవులకు వాటి పరిసరాలకు మధ్య జరిగే అంత:చర్యల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విజ్ఞానమే ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రం అనే పదాన్ని ఇంగ్లీష్​లో ఎకాలజీ అని పిలుస్తారు. ఆవరణ శాస్త్రం అనే పదాన్ని 1868లో కార్ల్​రైటర్​ అనే శాస్త్రవేత్త మొదట ఉపయోగించగా, 1869లో ఎర్నెస్ట్ హెకెల్​ అనే శాస్త్రవేత్త ఈ పదానికి విస్తృత ప్రాచుర్యం కల్పించాడు. ఆవరణ శాస్త్ర పితామహుడు యూజీన్​ ఓడమ్​.  ముఖ్యమైన పదజాలాలను తెలుసుకోవడం ద్వారా ఆవరణ శాస్త్రం అధ్యయనం సులువవుతుంది. 

జాతి: తమలో తాము అంత: ప్రజననం జరుపుకునే జీవుల సమూహమే జాతి. భిన్న జీవ జాతుల మధ్య ఒకే జన్యు సముదాయాన్ని పంచుకుంటూ లైంగికపరమైన, శారీరకమైన తేడాలు, వైవిధ్యతలు ఉంటాయి. ఒక జాతికి చెందిన జీవులు వాటి పరిసరాలకు అనుగుణంగా కొత్త అనుకూలతలు పొందుతూ ఉంటాయి. దీనివల్ల కాలక్రమేణా పరిణామ క్రమంలో నూతన జాతులు ఆవిర్భవించాయి. అందువల్ల జాతి అనేది ఒక గతిశీల భావన. 

ఉదా:మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి. 

జీవి: ఒక జాతిలోని ప్రతి ప్రాణిని వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే అది జీవిగా పిలువబడుతుంది. ఇది ఆవరణశాస్త్ర అధ్యయనంలో అతి చిన్న ప్రమాణం. జీవి అనేది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. 


జనాభా: ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒకే జాతికి చెందిన, ఒకే జీవన విధానాన్ని కలిగిన, జన్యుపరమైన వినిమయాలు కలిగిన జీవుల సమూహాన్నే జనాభాగా పేర్కొంటారు. 
ఉదా: భారతీయ జనాభా, ఆఫ్రికన్​ జనాభా, యురోపియన్​ జనాభా.

జీవ సముదాయం: ఆవరణ వ్యవస్థలోని నిర్దిష్ట ప్రాంతంలో ప్రతిఘటన, పరస్పర సర్దుబాట్ల ద్వారా సహజీవనం చేస్తున్న వివిధ జాతులకు చెందిన జనాభాలను జీవ సముదాయంగా పిలుస్తారు. 

ఉదా: ఒక అడవిలో ఉన్న కుందేళ్లు, నక్కలు, పులులు, కొలనులోని కప్పలు, చేపలు, ఒక తోటలోని గులాబీలు, మల్లెలు. 

ఆవాసం: ఒక జాతి జీవులు నివసించే ప్రదేశాన్ని ఆవాసం అని పిలుస్తారు. ప్రతి జాతి ఒక నిర్దిష్ట ఆవాసాన్ని కలిగి ఉంటూ ఆ పరిసరాల నుంచి తనకు కావాల్సిన ప్రాథమిక అవసరాలను పొందుతుంది. నిర్దిష్ట ఆవాసం లేనిదే ఏ జాతి మనుగడ సాగించలేదు. 

ఉదా: మానవ జాతి ఎక్కువగా మైదానాలు, పీఠభూముల ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తుంది. అలాగే నక్కలు, పులులు, సింహాలు అటవీ ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తాయి. 

ఎకలాజికల్​ నిచ్​: ఆవరణ వ్యవస్థలోని ఏదైనా ఆవాసంలో ఒక జాతి క్రియాత్మక స్థాయిని తెలియజేసే భావన. ఇది నిర్దిష్ట ఆవాసంలో ఒక జీవి తన విధులను నిర్వర్తించే ప్రదేశం. మొదటిసారిగా ఈ పదాన్ని గ్రిన్నెల్​ అనే శాస్త్రవేత్త ఉపయోగించారు. 

ఉదా: మానవుడు సర్వభక్ష ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం, జలావరణ వ్యవస్థల్లో శైవలాలు ఉత్పత్తిదారులుగా విధులు నిర్వర్తించడం. భౌమ ఆవరణ వ్యవస్థలో వివిధ రకాల వృక్ష జాతులు ఉత్పత్తిదారులుగా తమ విధిని కొనసాగించడం.

ఎకలాజికల్​ నిచ్​లో రకాలు 

ఆవాస నిచ్​: ఒక జీవి ఆవాసాన్ని తెలియజేసే ప్రదేశం.

ఆహారపు నిచ్​: ఒక జీవి తినే ఆహార రకాన్ని, ఆహార సేకరణ కోసం ఏ జాతులతో పోటీతత్వాన్ని కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలియజేస్తుంది.

ప్రత్యుత్పత్తి నిచ్​: సంతానోత్పత్తి ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వర్తించాలి అనే ప్రదేశాన్ని తెలియజేస్తుంది.
 

భౌతిక, రసాయన నిచ్​: జీవి నివసించడానికి అనుకూలమైన భూ నిర్మాణం, నీరు, పోషకాలు లభ్యమయ్యే ప్రదేశాన్ని తెలియజేస్తుంది.

జీవ మండలం: రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆవరణ వ్యవస్థలతో కూడిన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని జీవ మండలం అని పిలుస్తారు. ఇందులో ప్రతి ఆవరణ వ్యవస్థలోని వివిధ జీవ సముదాయాలకు చెందిన వృక్ష, జంతు జాతులు ఆయా పరిసరాల్లోని శీతోష్ణస్థితి పరిస్థితులకు (ఉష్ణోగ్రత, వర్షపాతాల ఆధారంగా) అనుగుణంగా తమ విధులను, ఆహారపు అలవాట్లను కొనసాగిస్తూ ఆ పరిసరాలకు అనుగుణంగా అనుకూలతను పొంది ఉంటాయి.

ఉదా: టాండ్రా బయోమ్​. ఈ ప్రాంతం అంతా కూడా శృంగాకార వృక్ష జాతులు విస్తరించి ఉంటాయి.
 
ఉదా: ఉష్ణమండల వర్షారణ్యాలు 

ఎకోటోన్​: రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆవరణ వ్యవస్థల మధ్య గల పరివర్తన ప్రాంతాన్ని ఎకోటోన్​ అని పిలుస్తారు. 

ఉదా: భౌమ, జలావరణ వ్యవస్థల మధ్య గల మాంగ్రూవ్​ ఆవరణ వ్యవస్థ, గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ, ఎస్టురీ ఆవరణ వ్యవస్థ ( నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ) 

జీవ సాంద్రీకృతము: మృత్తికలు, నీటి నుంచి హానికర రసాయనాలు ఆహారపు గొలుసులు ఆహార మాధ్యమంగా దిగువ పోషకస్థాయిల్లోని జీవుల నుంచి పై పోషక స్థాయి జీవుల్లో పేరుకుపోవడాన్ని జీవ సాంద్రీకృతము అని పిలుస్తారు. 

జీవావరణ పిరమిడ్లు: ఆవరణ వ్యవస్థకు సంబంధించిన వివిధ జీవ జాతులకు చెందిన జనాభా, జీవ పదార్థం, ఆహారపు గొలుసుల్లోని వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉన్న శక్తి పరిణామాలను రేఖీయంగా చూపించడాన్ని జీవావరణ పిరమిడ్లు అని పిలుస్తారు. ఈ భావనను మొదటిసారిగా 1927లో చార్లెస్​ ఎల్టన్​ అనే ఆవరణ శాస్త్రవేత్త ప్రతిపాదించడం వల్ల వీటిని ఎల్టోనియం పిరమిడ్లు అని కూడా పిలుస్తారు. 

ఆవరణ వ్యవస్థ

 జీవ నిర్జీవ అంశాలతో కూడుకున్న ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య పరస్పరం జీవ– భూ రసాయన వలయాల ద్వారా శక్తి, పోషకాల మార్పిడి జరిగే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థగా ఏజీ టాన్​స్లే అనే పర్యావరణ శాస్త్రవేత్త 1935లో మొదటిసారిగా ఆవరణ శాస్త్ర భావనను పేర్కొన్నారు. ఆవరణ వ్యవస్థ అనేది జీవావరణ నిర్మాణాత్మక క్రియాత్మక ప్రాథమిక ప్రమాణం అని ఓడమ్​ అనే ఆవరణ శాస్త్రవేత్త పేర్కొన్నారు.

పోషక స్థాయిలు: ఒకే రకమైన ఆహారపు అలవాట్లు గల జీవులను ఒక సముదాయంగా ఆవరణ వ్యవస్థలో గుర్తిస్తారు. దీన్నే పోషకస్థాయి అంటారు. జీవులు వాటి ఆహారపు అలవాట్లను అనుసరించి ఆహారపు గొలుసుల్లో అవి వివిధ పోషక స్థాయిలను ఆక్రమించి ఉంటాయి. ఇందులో ఉత్పత్తిదారులైన వృక్షాలు, ఆహార గొలుసులో మొదటి పోషక స్థాయిని ఆక్రమించి ఉండగా, మిగిలినవి ద్వితీయ, తృతీయ, చతుర్ధ పోషక స్థాయిలను ఆక్రమించి ఉంటాయి.