
తలనొప్పిగా ఉన్నా.. ఒళ్లు నొప్పులుగా ఉన్నా.. జలుబు అయినా.. జ్వరం అయినా కామన్ గా ఓ ట్యాబ్లెట్ వాడతారు చాలా మంది.. అదే యాస్పిరిన్.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో సంబంధం లేకుండా మెడికల్ షాపునకు వెళ్లి.. ఈ ట్యాబ్లెట్ కొని వేసుకోవటం చాలా చాలా మందికి అలవాటునే.. ఇక జలుబు, జ్వరం.. ముఖ్యంగా తలకాయ నొప్పిగా ఉంటే ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకోవటం కామన్.. ఇలాంటి ట్యాబ్లెట్ పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కారణం.. ఈ ట్యాబ్లెట్ లోని మందుకు కొన్ని క్యాన్సర్ కణాలను చంపే పవర్ ఉందంట.. అదే విధంగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరికట్టటంలోనూ ఈ ఆస్పిరిన్ ట్యాబ్లెట్ పని చేస్తున్నట్లు ఇటీవల జరిగిన పరిశోధనల్లో స్పష్టమైనట్లు నేచర్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది.
ఆస్పిరిన్ ట్యాబ్లెట్ వాడటం వలన బాడీలో ఇమ్యూన్ సిస్టం (రోగనిరోధక శక్తి) పెంచడం వలన కొన్ని క్యాన్సర్ కణాలను తగ్గిస్తుందని స్టడీలో తేలింది. క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్స్ క్రమం తప్పకుండా తక్కువ డోస్ తో కూడిన ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ వాడటం వలన.. బ్రెస్ట్, ప్రోస్టేట్, ప్రేగు సంబంధిత క్యాన్సర్ కణాల వ్యాప్తిని తగ్గించిందని పరిశోధనల్లో తేలింది . అయితే ఈ మూడు ప్లేస్ లలో మొదలయ్యే క్యాన్సర్.. బాడీ అంతా పాకడంతోనే 90 శాతం మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాప్తిని నివారించడంలో ఆస్పిరిన్ తోడ్పడుతుందని సైంటిస్టులు వెల్లడించారు.
అయితే క్యాన్సర్ కణాల వ్యాప్తిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు తాజాగా ఈ విషయాన్ని గమనించినట్లు ప్రకటించారు. ఒకచోట మొదలయ్యే క్యాన్సర్ ట్యూమర్ పగిలి.. కణాలు వ్యాప్తి చెందుతుంటాయి. అవి బాడీలోని ఇమ్యూస్ సిస్టమ్ ను దెబ్బతీసీ మనిషి మృతికి కారణం అవుతాయి. ఈ విషయంలో ఆస్పిరిన్ వలన వచ్చిన మంచి ఫలితాలను దృష్టిలో ఉంచుకుని.. మరింత అధ్యయనం చేయనున్నారు.
ALSO READ | స్విగ్గీలో ఫాస్టింగ్ మోడ్.. ఉపవాసం ఉండేవారికి స్పెషల్ ఫీచర్..
ఎలుకల్లోని 810 జీన్స్ ను పరీక్షించారు సైంటిస్టులు. అందులో 15 జీన్స్ క్యాన్సర్ కణవ్యాప్తికి ప్రభావితం అవుతున్నట్లు గుర్తించారు. ARHGEF1 అనే ప్రోటీన్ ను విడుదల చేసే జీన్ లేకపోవడం వలన ఎలుకల్లో క్యాన్సర్ కణాల వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటి వ్యాప్తిని అడ్డుకునే ‘టీ సెల్’ ను ఈ ARHGEF1 అనే ప్రోటీన్ తగ్గిస్తుందని సైంటిస్ట్ లు తేల్చారు.
అయితే ఈ ప్రోటీన్ ను టార్గెట్ చేసే డ్రగ్స్ ను తయారు చేయడంపై ఫోకస్ పెట్టారు శాస్త్రవేత్తలు. టీ సెల్ పై ఈ ప్రోటీన్ ప్రభావం పడినప్పుడు కణాలు గడ్డకట్టే పరిస్థితి ఉంటుందని, ఈ పరిస్థితిని త్రోంబాక్సేన్ ఏ2 గా పిలుస్తున్నారు (TXA2). ఈ సిచువేషన్ వచ్చినపుడు ఆస్పిరిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, కణాలు వ్యాప్తి, గడ్డకట్టడంపై పోరాడుతుందని చెబుతున్నారు సైంటిస్ట్ లు.
అంతేకాకుండా TXA2 ను తగ్గించి, టీ సెల్స్ కుచించుకుపోకుండా చేయడం వలన క్యాన్సర్ వ్యాప్తిని ఆస్పిరిన్ నివారిస్తుందని స్టడీలో తేలింది. ఎలుకలపై చేసిన ప్రయోగంలో సత్ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు సైంటిస్ట్ లు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు.