స్టడీ స్కాలర్​షిప్స్​.. ఎంపికైతే నెలకు రూ.13,400

స్టడీ స్కాలర్​షిప్స్​.. ఎంపికైతే నెలకు రూ.13,400

చదువుకునే విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్​ సంస్థలు స్కాలర్​షిప్స్​ అందిస్తున్నాయి. ఒకటో తరగతి నుంచి పీహెచ్‍డీ దాకా ప్రతి దశలో కొన్ని సంస్థలు స్కాలర్​షిప్​ ద్వారా విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. ఇంటర్​ పూర్తి చేసి, ఇంజినీరింగ్​, మెడిసిన్​ కోర్సులు చేయాలనుకునే  స్టూడెంట్స్​కు ఉపకారవేతనాలు అందిస్తున్న సంస్థల గురించి తెలుసుకుందాం.. 

ఎల్​ అండ్​ టీ బిల్డ్​ ఇండియా స్కాలర్​షిప్
ఇంజినీరింగ్​ పూర్తి చేసుకొని ఎంటెక్​ చేయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎల్​ అండ్​ టీ బిల్డ్​ ఇండియా స్కాలర్​షిప్​ అందిస్తోంది. ఎంపికైన విద్యార్థులు  ఐఐటీ చెన్నై, ఐఐటీ ఢిల్లీ, ఎన్​ఐటీ సూరత్​కల్​, ఎన్​ఐటీ తిరుచ్చిలోనే కన్​స్ట్రక్షన్​ టెక్నాలజీ అండ్​ మేనేజ్​మెంట్​ కోర్సులో ఎంటెక్​ చేయాలి. ఇన్​స్టిట్యూట్స్​కు సంబంధించిన ఫీజుతో పాటు విద్యార్థులకు నెలకు రూ.13,400 అందజేస్తుంది. 
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో బీటెక్​ (సివిల్​, ఎలక్ట్రికల్​) ఉత్తీర్ణులై ఉండాలి. షార్ట్​లిస్టు చేసిన అభ్యర్థులకు ఆన్​లైన్​ ఎగ్జామ్​ ఉంటుంది. అందులో సెలెక్ట్​ అయిన విద్యార్థులకు ఇంటర్వ్యూ, మెడికల్​ టెస్ట్ చేసి ఫైనల్​గా ఎంపిక చేస్తారు. స్కాలర్​షిప్​ కోసం ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. 
వెబ్​సైట్​: www.intecc.com

ఎల్​ఐసీ చేయూత
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఏటా లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్​ఐసీ) స్కాలర్​షిప్స్​ అందిస్తోంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్​ ఉత్తీర్ణులై,  కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష మించరాదు. 
సెలెక్షన్​: పదోతరగతి, ఇంటర్​ మార్కులు, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎంపిక చేస్తారు. దేశ వ్యాప్తంగా ఒక్కో ఎల్​ఐసీ డివిజినల్​ సెంటర్​ నుంచి 20 మందికి ఇస్తారు. ఎంపికైన విద్యార్థికి ఏటా రూ.20 వేలు చెల్లిస్తుంది. 
వెబ్​సైట్​: www.licindia.in 

దివ్యాంగులకు ‘సాక్షం’
స్పెషల్లీ ఏబుల్డ్​ స్టూడెంట్స్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్​ కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సాక్షం స్కాలర్​షిప్​ అందిస్తోంది. డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్​ పొందిన దివ్యాంగులు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: డిజిబిలిటి 40 శాతం లేదా అంతకు మించి ఉండాలి. ఆదాయం రూ.8 లక్షలు మించరాదు. మెరిట్​ ఆధారంగా రూ. 50 వేల స్కాలర్​షిప్​ ఇస్తారు.

వెబ్​సైట్​: www.aicte-india.org

ఒన్లీ ఫర్​ గర్ల్స్​
డిప్లొమా, ఇంజినీరింగ్​ చదువుకునే విద్యార్థినులకు ఆర్థిక చేయూతనివ్వడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మొత్తం ఐదువేల ప్రగతి స్కాలర్​షిప్స్​ అందజేస్తుంది. 
అర్హత: ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిగ్రీ /  డిప్లొమా ఫస్ట్​ ఇయర్​లో అడ్మిషన్​ పొందిన వారు అర్హులు. ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు బాలికలకు మాత్రమే ఇస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించరాదు. నాలుగేండ్లలో రూ.50 వేలు చెల్లిస్తారు. నవంబర్​ 30వ తేదీలోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. 
వెబ్​సైట్​: www.aicte-india.org

మెరిట్​ స్కాలర్​షిప్​
పేద మైనారిటీ విద్యార్థులు ప్రొఫెషనల్​, టెక్నికల్​ కోర్సులు చేయడానికి నేషనల్​ మీన్స్​ కమ్​ మెరిట్​ స్కాలర్​షిప్స్​ దేశ వ్యాప్తంగా 60వేల మందికి అందిస్తున్నారు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో టెక్నికల్​ డిగ్రీ/ పీజీ చేస్తున్న విద్యార్థులు అర్హులు. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించరాదు. ప్రతి ఏడాది రూ. 20 వేలు అందజేస్తారు.

వెబ్​సైట్: scholarships.gov.in