కోటగిరి మండలంలో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించండి : సబ్‌‌‌‌ కలెక్టర్ వికాస్ మహ

కోటగిరి మండలంలో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించండి : సబ్‌‌‌‌ కలెక్టర్ వికాస్ మహ

కోటగిరి, వెలుగు: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని నిజాం సాగర్ కెనాల్ బౌండ్రీని ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని బోధన్ సబ్‌‌‌‌ కలెక్టర్ వికాస్ మహతో అధికారులకు సూచించారు. కోటగిరి బస్టాండ్ పక్కనే ఉన్న నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ డీ 28/1/2  కెనాల్‌‌‌‌ బౌండ్రీ స్థలాన్ని రఫీ అనే వ్యక్తి ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నందున అధికారులు వెంటనే స్పందించి వాటిని తొలగించాలని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నెలరోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. దీనికి స్పందించిన బోధన్ సబ్ కలెక్టర్ ఆ స్థలాన్ని గురువారం పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెనాల్ బౌండ్రీలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కెనాల్ బౌండ్రీ సరిహద్దును సర్వే చేసి నిర్ణయించాలని తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. రెండు, మూడు రోజుల్లో సర్వే పూర్తి చేసి,  రిపోర్టు పంపాలని ఆదేశించారు. సబ్  కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న కెనాల్ ఆయకట్టు రైతులు అక్కడికి వచ్చి వెంటనే అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు. 

లేదంటే, తమ పంట పొలాలకు సాగునీరు అందటం కష్టమవుతుందన్నారు.  పంటలు ఎండిపోతాయని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆక్రమణలతో సాగర్ నీరు వచ్చినప్పుడు కెనాల్ గుండా వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తహసీల్దార్ గంగాధర్, ఇరిగేషన్ ఏఈ సత్యనారాయణ, సీపీఐ కార్యదర్శి విఠల్ గౌడ్, రైతులున్నారు.