
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్) బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో 1876 సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు గ్రూప్–బి కాగా అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లు గ్రూప్–సి పోస్టులు. ప్రారంభంలోనే ఎస్ఐ పోస్టులకు రూ.50 వేలు, ఏఎస్ఐ జాబ్‌కు 40 వేల దాకా వేతనం లభిస్తుంది. దీంతో పాటు ఇతర అన్ని సదుపాయాలుంటాయి. సాధారణంగా కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టులకే ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక ఎస్ఐ అంటే లక్షల మంది పోటీ పడతారు. డిగ్రీతోనే సుస్థిర భవిత కలిగిన కేంద్ర కొలువు లభించడమే ఇందుకు కారణం. రిటెన్ టెస్టుతో పాటు ఫిజికల్ టెస్టులకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు కాబట్టి శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: నాలుగు దశల్లో నిర్వహించే టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు. మొదటి దశలో పేపర్–1, రెండోదశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మూడోదశలో పేపర్–2, నాలుగోదశలో డీటెయిల్డ్ మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. పేపర్–1లో నాలుగు సబ్జెక్టుల నుండి 200 మార్కులకు 200 ప్రశ్నలిస్తారు. పేపర్–2లో 200 మార్కులకు ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్సన్ అనే ఒక సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలొస్తాయి. రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్‌లోనే ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 శాతం మైనస్ అవుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీలో ముద్రిస్తారు. రెండు పేపర్లలో క్వాలిఫై కావాలంటే జనరల్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లు 25%, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఫిజికల్ టెస్ట్స్ కీలకం
ఈ పోస్టుల్లో రాతపరీక్షకు ధీటుగా ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి. 100 మీటర్ల పరుగును 16 సెకన్లలో, 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6.5 నిమిషాల్లో, 3.65 మీటర్ల లాంగ్ జంప్ 3 చాన్సుల్లో చేయాలి. 1.2 మీటర్ల హైజంప్, 4.5 మీటర్ల షాట్‌పుట్ విసరాల్సి ఉంటుంది. మహిళలకు నిబంధనల్లో కాస్త సడలింపు ఉంటుంది. పురుషులకు గాలి పీల్చినప్పుడు ఛాతీ 5 సెం.మీ. విస్తరించాలి. శరీరంపై నిర్దేశించిన ప్రమాణాల మేరకే టాటూలో అనుమతిస్తారు. అంటే శరీరభాగంలో 1/4వ వంతు ఉండాలి. శరీర భాగాల కిందివైపు కన్పించకుండా ఉండాలి. మతానికి సంబంధించిన పేర్లు, చిహ్నాలు మాత్రమే అనుమతిస్తారు.
సిలబస్
జనరల్ అవేర్‌నెస్ : కరెంట్ అఫైర్స్ నుంచి వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, ముఖ్యమైన తేదీలు, కేంద్రప్రభుత్వ పథకాలు, దేశాలు, రాజధానులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతి, కేపిటల్, కరెన్సీల నుంచి ప్రశ్నలు వస్తాయి. రోజువారీ దిన పత్రికల్లోని ముఖ్యమైన వార్తలను, వాటికి అనుసంధానంగా ఉన్న ఇతరత్రా సమాచారం సేకరించాలి. ప్రాథమిక విశ్లేషణతో ఆలోచిస్తూ అంశాలవారీగా ప్రిపరేషన్ కొనసాగించాలి. జనరల్ సైన్స్‌లో ఇన్‌వెన్షన్స్- డిస్కవరీస్, మెజర్‌మెంట్స్, థియరీస్, కెమికల్ ఫార్ములా, ప్లాంట్, హ్యూమన్ బాడీస్, వ్యాక్సిన్, వైరస్ తదితర అంశాలు ముఖ్యమైనవి. చరిత్రకు సంబంధించి భారతదేశ చరిత్ర, మధ్యయుగం, ఆధునిక యుగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రాజ్యాలు, స్థాపకులు, యుద్ధాలు, గవర్నర్ జనరల్స్, గాంధీయుగం, ఉద్యమాలు ముఖ్యమైనవి. జాగ్రఫీ నుంచి నదులు, పర్వతాలు, నేలలు, సరిహద్దులు, అడవులు, వాతావరణం, పక్షులు, జంతు సంరక్షణ - పరిరక్షణ, సంబంధిత అంశాల నుంచి ఎక్కువ సమాచారం సేకరించాలి. పాలిటీలో ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంట్, అధికరణలు, సవరణలు ముఖ్యమైనవి. ఎకానమీ నుంచి డిమాండ్- సప్లయ్, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్ రకాలు, జాతీయ-అంతర్జాతీయ సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి.
రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్: నాన్ వెర్బల్, హైలెవల్ రీజనింగ్, పజిల్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్-1, టైర్-2లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఎక్కువ స్థాయి ఉండే ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. అనాలజీ, సిరీస్, కోడింగ్- డీ కోడింగ్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, క్లాక్, క్యాలండర్, దిక్కులు, రక్త సంబంధాలు, క్యూబ్, డైస్, వెన్ చిత్రాలు, పజిల్స్, సిలాజిజమ్, ర్యాంకింగ్ సీక్వెన్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: సింప్లిఫికేషన్, ఇంట్రెస్ట్, యావరేజెస్, పర్సెంటేజ్, రేషియో & ప్రపోర్షన్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, టైం & వర్క్, ఆల్జీబ్రీ, ట్రిగనోమెట్రీ, జామెట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. లాజిక్, టెక్నిక్, షార్ట్కట్లు వాడి తక్కువ సమయంలో సమాధానాలు గుర్తించాలి. ఎక్కువ ప్రశ్నలను సాధన చేయడం వల్ల సబ్జెక్టు మీద పట్టు సాధించవచ్చు. ఎలాంటి ప్రశ్నలకు తప్పు సమాధానాలు గుర్తిస్తున్నామో తెలుసుకోవచ్చు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్: రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ప్రేజస్ & ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్ & ఫ్రేజెస్. గ్రామర్ మీద పూర్తి అవగాహన ఉండాలి. రీడింగ్ స్కిల్ మెరుగుపరుచుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రతి అంశం నుంచీ కనీసం 200 ప్రశ్నలు సాధన చేస్తే ఇంగ్లీష్ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
నోటిఫికేషన్
ఖాళీలు: మొత్తం 1876 ఉద్యోగాల్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ)లో సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ) 1714 ఉన్నాయి. ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు/ మహిళలకు 162 పోస్టులు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌లో పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.