
హైదరాబాద్, వెలుగు: కేటుగాళ్లను నమ్మి అమాయక ప్రజలు తమకు తెలియకుండానే అసైన్డ్ భూములను కొని నష్టపోతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌లతో కేటుగాళ్లు కుమ్మక్కై మోసానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్‌రిజిస్ట్రార్‌లకు లేదని తెలిపింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అసైన్డ్ భూమి/లావణి పట్టా భూమి విక్రయంపై మూడు నెలల్లో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. మొయినాబాద్‌లో సర్వే నెం.176/23లో 0.335 ఎకరాల లావణి పట్టా భూమిని అనుమతి లేకుండా తమ కొడుకులు మరొకరికి విక్రయించడంపై ఈ. నాగమ్మతోపాటు ఆమె ముగ్గురు కుమార్తెలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారించారు.
పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. నాగమ్మ అనుమతి లేకుండా ఆమె భర్తకు చెందిన అసైన్డ్ భూమిని నలుగురు కొడుకులు, మరో వ్యక్తికి 2021లో విక్రయించారన్నారు. విక్రయించేముందు తల్లితో పాటు కుమార్తెల అంగీకారం తీసుకోలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫసలీ ప్రకారం.. అసైన్డ్ భూమిని వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సి ఉందన్నారు.
ఏవైనా షరతులను ఉల్లంఘించినట్లయితే అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్నారు. అసైన్డ్ చట్టంలోని సెక్షన్ 7 (2ఎ) ప్రకారం.. ఏ అధికారి అయినా సెక్షన్ 5 (1)(2) కింద నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు నెలల సాధారణ జైలు, రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చని స్పష్టం చేశారు.